Cabdriver: ఇంటి ఓనర్ ముసలమ్మను చంపేసి సూట్‌కేసులో సర్ది గోదావరిలో పడేశారు - ఈ ఒక్క తప్పు చేయకపోతే దొరికేవారు కాదు!
House Owner Murder: హైదరాబాద్ లో ఓ క్యాబ్ డ్రైవర్ ఇంటి యజమానిని చంపేసి సూట్ కేసులో డెడ్ బాడీ పెట్టుకుని తీసుకెళ్లి గోదావరిలో పడేశారు. చిన్న క్లూ ఆధారంగా పోలీసులు హంతకుల్ని పట్టుకున్నారు.

House Owner Murder by Cab Driver: హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన వృద్ధురాలి హత్య ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది. మల్లాపూర్‌లో నివసించే 65 ఏళ్ల సుజాత అనే వృద్ధురాలిని, ఆమె ఇంట్లోనే అద్దెకు ఉంటున్న ఓ క్యాబ్ డ్రైవర్ బంగారు నగల కోసం అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజిబాబు అనే వ్యక్తి మల్లాపూర్‌లోని సుజాత అనే వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒంటరిగా ఉంటున్న సుజాత వద్ద భారీగా బంగారు ఆభరణాలు ఉన్నాయని గమనించిన అంజిబాబు, వాటిని దక్కించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత వారం సుజాతను దారుణంగా గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకున్నాడు.
హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు అంజిబాబు తన ఇద్దరు స్నేహితుల సహాయం తీసుకున్నాడు. సుజాత మృతదేహాన్ని సూట్ కేసులో సర్దేసి తన కారులతోనే తీసుకెళ్లాడు. సూట్ కేసును తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒక కారులో తరలించి, గోదావరి నదిలో పడేశారు. వృద్ధురాలు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా ఉంచడంతో పాటు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వృద్ధురాలు కనిపించకుండా పోయిన సమయంలో అంజిబాబు ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల శైలిలో విచారించగా, తనే హత్య చేసినట్లు అంజిబాబు అంగీకరించాడు. మృతదేహాన్ని ఎక్కడ పడేసిందీ వివరించడంతో, పోలీసులు గోదావరి నది నుండి మృతదేహాన్ని వెలికితీశారు.
AP-based cab driver murdered his 65-yr-old landlady for gold in Mallapur, Nacharam in #Hyderabad. After a missing complaint, police cracked the case accused Anjibabu confessed to killing Sujatha and dumping her body in the Godavari with 2 aides. All arrested. #Telangana pic.twitter.com/B2CETOV0ZN
— Ashish (@KP_Aashish) December 30, 2025
ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు అంజిబాబుతో పాటు, మృతదేహాన్ని తరలించడంలో సహకరించిన అతని ఇద్దరు సహచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హత్య, సాక్ష్యాధారాల మరుగునపరచడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.





















