Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
Kathua Terrorist Attack: జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. ఆర్మీ కాన్వాయ్ వెళ్తుంటే గ్రెనేడ్ విసిరి, ఆపై కాల్పులు జరపగా నలుగురు ఆర్మీ సిబ్బంది మృతి చెందారు.
Jammu and Kashmir Terrorist Attack: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. భారత ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రమూకలు దాడి చేశాయి. ఈ ఉగ్రదాడిలో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు. మరో ఆరుగురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉగ్రదాడి ఘటన జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లాలోని మచేది ఏరియాలో సోమవారం జరిగింది. మొదట ఆర్మీ కాన్వాయ్ వెళ్తుంటే గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదులు ఆ వెంటనే జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. కానీ అప్పటికే తీవ్ర నష్టం జరిగి పోయింది. సమాచారం అందగానే పెద్ద ఎత్తున బలగాలు అక్కడికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
కథువా సిటీకి 150 కిలోమీటర్ల దూరంలోని మచెడి-కిండ్లీ- మల్హర్ రహదారిపై బద్నోటా గ్రామంలో ఈ ఉగ్రదాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా దాడి చేశారు. మొదట గ్రెనేడ్ విసిరిన టెర్రరిస్టులు, ఏం జరిగిందని జవాన్లు తెరుకునేలోగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులు కాగా, మరో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. భారత ఆర్మీ అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడినుంచి అడవిలోకి పరారయ్యారని పీటీఐ రిపోర్ట్ చేసింది.
#UPDATE | Four Indian Army soldiers have been killed while an equal number are injured in the terrorist attack in Machedi area of Kathua. The firefight between troops and the terrorists is on. More details awaited: Defence officials https://t.co/IfGjVDT9rx
— ANI (@ANI) July 8, 2024
జమ్మూకాశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు..
గత నాలుగు వారాల్లో కథువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో ఇది రెండో అతిపెద్ద ఘటన. మరోవైపు కుల్గామ్‌లో భారత ఆర్మీ ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చిన తరువాత ఈ దాడి జరిగింది. జూన్ 12, 13 తేదీలలో సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ చేయడంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం ఎదురుకాల్పులు జరపగా, ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు, ఓ జవాన్ చనిపోయారు. జూన్ 26న దోడా జిల్లాలోని గండోహ్ లో ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిసిందే.
రియాసి జిల్లాలోని శివ్ ఖోరి ఆలయం నుంచి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై జూన్ 9న ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్, కండక్టర్‌తో సహా తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 41 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు.