Crime News: మత్తు ఇంజక్షన్ ఇచ్చి వ్యక్తి కిడ్నాప్ - రూ.2 కోట్లు డిమాండ్, నలుగురు నిందితుల అరెస్ట్
Chittor Crime News: తిరుపతి జిల్లాలో ఈ నెల 24న ఓ వ్యక్తి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్లు రూ.2 కోట్లు డిమాండ్ చేయగా.. పోలీసులు సినీ ఫక్కీలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Four Accused In Chittor Kidnap Case: తిరుపతి జిల్లా భాకరాపేటలో వ్యక్తి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సినీ ఫక్కీలో కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన నకిలీ పిస్టల్, మత్తు మందు ఇంజెక్షన్లు, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లాలో ఈ నెల 24న జరిగిన వ్యక్తి కిడ్నాప్ కేసుకు సంబంధించి వివవరాలను ఎస్పీ సోమవారం మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి (Tirupati) జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం చెరువుమందరపల్లి గ్రామానికి చెందిన జంగం భాస్కర్ ఈ నెల 24న కిడ్నాప్‌నకు గురయ్యాడు. భాకరాపేట ఘాట్ రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆటోలో వెళ్తుండగా కిడ్నాపర్లు నకిలీ తుపాకీతో బెదిరించి.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరీ కిడ్నాప్ చేశారు.
రూ.2 కోట్లు డిమాండ్
భాస్కర్ వద్ద మొబైల్ నుంచి అతని కొడుకు రెడ్డి కిరణ్‌కు ఫోన్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. అంతమొత్తం లేదని చెప్పడంతో చివరకు రూ.2 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే భాస్కర్‌ను చంపుతామని బెదిరించారు. దీంతో కిరణ్ పోలీసులను ఆశ్రయించాడు. ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం భాకరాపేట ఘాట్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద కిడ్నాపర్లను గుర్తించారు. పోలీసులను చూసిన నిందితులు కారులో తప్పించుకునేందుకు యత్నిస్తూ పోలీస్ వాహనాన్నే ఢీకొట్టారు. నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితులు బెంగుళూరు, రొంపిచెర్ల, భాకరాపేట, రాయచోటిల్లో పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రచందనం కేసుల్లోనూ నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు.
Also Read: Crime News: తెలంగాణలో విషాదాలు - భార్యను చంపి భర్త సూసైడ్, బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య