Lovers Suicide: బతికి ఉన్నప్పుడు ప్రేమను కాదన్నారు... చనిపోయిన తర్వాత పెళ్లి చేశారు... మహారాష్ట్రలో వింత ఘటన
అంత్యక్రియల సమయంలో యువతీయువకుల తల్లిదండ్రులు ఈ పెళ్లి జరిపించారు. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో భడ్‌గావ్ తహసీల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బతికి ఉండగా పిల్లల ప్రేమను అర్థం చేసుకోని పెద్దలు వారు చనిపోయాక చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డారు. ఇందు కోసం ఎవరూ చేయని పని చేశారు. తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత వారి ప్రేమను గుర్తించిన తల్లిదండ్రులు వారు చనిపోయాక ఇద్దరికీ పెళ్లి జరిపించారు. అంత్యక్రియల సమయంలో యువతీయువకుల తల్లిదండ్రులు ఈ పెళ్లి జరిపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో జరిగింది.
Also Read: Weather Updates: ఏపీ, తెలంగాణలో ఈ ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు.. హైదరాబాద్‌లో ఇలా..
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా భడ్‌గావ్ తహసీల్‌కు చెందిన ఇద్దరు యువతీయువకులు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిలో యువతి వయసు 19 ఏళ్లుకాగా, యువకుడి వయసు 22 ఏళ్లు. వీరి పెళ్లికి వారి ఇళ్లలో పెద్దలు నిరాకరించారు. ఎంత చెప్పినా వినకపోవడంతో చివరికి కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ప్రేమ జంట చదువుకున్న పాఠశాలలోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
శనివారం రాత్రి వాడే గ్రామంలోని ఓ పాఠశాలలో యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగుచూసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రేమికుల ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని వారి మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు. విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్థులను సైతం ఈ దృశ్యం కలచివేసింది.
అయితే, వారు చనిపోయాక ఇద్దరి ప్రేమను గుర్తించిన తల్లిదండ్రులు.. ఆ జంట మృతదేహాలకు పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు నిర్వర్తించే ముందు చితిపైనే పెళ్లి జరిపించి, ఆ తర్వాత దహన సంస్కారాలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన ఆదివారం జరగ్గా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాక, శ్మశానంలోనే చనిపోయిన వారికి పెళ్లి జరిపించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Hyderabad Nizam Alam: 18 ఏళ్ల క్రితం మాయం.. ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం.. హాట్ టాపిక్‌గా నిజాం ఆలమ్
Also Read: Gold-Silver Price: రెండ్రోజులుగా స్థిరంగా పసిడి ధర.. వెండి పైపైకి.. నేటి ధరలివీ..