JC Prabhakar Reddy: తాడిపత్రి రాజకీయం హాట్ హాట్...రాత్రంతా మున్సిపల్ ఆఫీసులో జేసీ ప్రభాకర్ రెడ్డి...అధికారులకు ఒంగి ఒంగి దండాలు
అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. తన సమావేశానికి అధికారులు గైర్హాజరు అయ్యారని రాత్రంతా కార్యాలయంలోని ఉండి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ నిరసన తెలిపారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా సెన్సేషన్. తాజా ఆయనకు తెచ్చిన ఆగ్రహం ఘటన ఆయన సమావేశం పెడితే అధికారులు గైర్హాజరు కావడం. మున్సిపల్ ఛైర్మన్ హోదాలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే అందరూ కట్టగట్టుకుని గైర్హాజరు అయ్యారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు కమిషనర్‌తో సహా అధికారులందరికీ జేసీ శనివారమే తెలపారు. ఈ సమయానికే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ సిబ్బందితో కరోనా వైరస్‌పై అవగాహన ర్యాలీ, సమీక్ష నిర్వహించారు. దీంతో అధికారులకు అయోమయ పరిస్థితి ఏర్పడింది.
ఈ ర్యాలీ పూర్తయ్యాక మున్సిపల్ కార్యాలయానికి అధికారులు వస్తారనే ఉద్దేశంతో 12.30 గంటలకు ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కమిషనర్ ఛాంబర్‌లో ఎదురుచూశారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమీక్ష అనంతరం అటు నుంచే ఇళ్లకు వెళ్లిపోయారు. కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళ్తూ ఇతరులకు బాధ్యతలు అప్పగించారని తెలియడంతో ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కార్యాలయానికి వచ్చే వరకు అక్కడి నుంచి తాను కదిలేది లేదని మున్సిపల్ కార్యాలయంలోనే ఆయన నిరసనకు దిగారు. సాయంత్రం 4.30 గంటలకు కొంత మంది అధికారులు కార్యాలయానికి రాగా, వారి నిబద్ధతను మెచ్చుకుంటున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి చూపిన హావాభావాలకు అధికారులు ఏం సమాధానం చెప్పలేని స్థితిలో పడ్డారు.
మున్సిపల్ సిబ్బంది కనిపించడంలేదంటూ ఫిర్యాదు
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది 26 మంది కనిపించడం లేదంటూ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో చెప్పిన వివరాల ఇలా ఉన్నాయి. సోమవారం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డితో పాటు ఉద్యోగి చాంద్‌బాషాకు శనివారమే సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. మున్సిపల్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా మేసేజ్ చేసినట్లు తెలిపారు. ఇటీవల అధికారులు టెంకాయలు విక్రయించే వారికి హెచ్చరికలు జారీచేశారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులకు, ఉద్యోగులకు ఎవరైనా హాని తలపెట్టి ఉంటారేమోనని ఆందోళన చెందుతున్నామని, వారి ఆచూకీ కనుక్కొని చెప్పాలని జేసీ ప్రభాకరరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాత్రంతా ఆఫీసులో...అక్కడే స్నానం
వాస్తవానికి మున్సిపల్ ఛైర్మన్ హోదాలో తాడిపత్రిలోని పరిస్థితులపై జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులతో సమీక్ష పెట్టుకున్నారు. కానీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో మరో మీటింగ్ పెట్టి వారిని తీసుకెళ్లారని జేసీ అన్నారు. ఈ విషయంపై ఆగ్రహంతో అధికారులు వచ్చి మీటింగ్‌లో పాల్గొనే వరకూ తాను ఆఫీస్ నుంచి కదలని రాత్రంతా అక్కడే భీష్మించుకుని కూర్చొన్నారు. సోమవారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లిన ఆయన రాత్రి వరకూ అక్కడే ఉన్నారు. అయినా అధికారులు రాకపోయే సరికి రాత్రంతా అక్కడే ఉండి, అక్కడే భోజనం చేసి, పడుకున్నారు. ఇక ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, అధికారుల కోసం వేచిఉన్నారు.
కమిషనర్ ఆహ్వానం...కానీ
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని మున్సిపల్ కమిషనర్ నర్సింహప్రసాద్ మంగళవారం కలిశారు. సోమవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో జేసీని కలిసిన కమిషనర్ మంగళవారం అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. మున్సిపల్ ఛైర్మన్ హోదాలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు గైర్హాజరై ఈ రోజు రావాలని ఆహ్వానించడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Tadipatri JC : తాడిపత్రిలో మళ్లీ టెన్షన్..! మున్సిపల్ ఆఫీసులో జేసీ ప్రభాకర్ ఆందోళన..!