Tadipatri JC : తాడిపత్రిలో మళ్లీ టెన్షన్..! మున్సిపల్ ఆఫీసులో జేసీ ప్రభాకర్ ఆందోళన..!
2రోజుల క్రితమే మున్సిపల్ పనులపై సమీక్ష చేస్తానని చైర్మన్ ప్రభాకర్ రెడ్డి చెప్పినా వెళ్లిపోయిన అధికారులు. ఎమ్మెల్యే సమీక్షకు హాజరై.. సెలవు పెట్టి ఆఫీసుకు కూడా రాకుండా మున్సిపల్ కమిషనర్ వెళ్లిపోయారు.
తాడిపత్రిలో మళ్లీ రాజకీయం రాజుకుంది. మున్సిపల్ చైర్మన్ హోదాలో అధికారులతో జేసీ ప్రభాకర్ రెడ్డి సమీక్ష ఏర్పాటు చేశారు. అయితే అధికారులు ఎవరూ ఈ సమీక్షకు రాలేదు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమీక్షా సమావేశం పెట్టడంతో అధికారులెవరూ మున్సిపల్ ఆఫీసులో లేకుండా... ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లిపోయారు. సమీక్ష కోసం వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి కార్యాలయంలో ఎవరూ కనిపించలేదు. దీంతో అధికారుల వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం సమీక్ష ఉందని రెండు రోజుల క్రితమే చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన సమావేశానికి అధికారులు రాకుండా చేయడానికే ఎమ్మెల్యే సమీక్ష పెట్టారని.. ఆయన మండిపడుతున్నారు. అదే సమయంలో మున్సిపల్ కమిషనర్.. సెలవుపై వెళ్లిపోయారు. ఉదయం.. ఎమ్మెల్యే పెద్దారెడ్డితో సమీక్షలో పాల్గొన్న కమిషనర్.. తర్వాత ఆఫీసుకు కూడా రాకుండా వెళ్లిపోయారు. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. తనకు ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పేంతవరకు ఆందోళన చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. రాత్రంతా మున్సిపల్ ఆఫీసులోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమాడు గత ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఓడిపోయారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచారు.
తర్వాత చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి అధికారులు ఇరువురి మధ్య నలిగిపోవడం ప్రారంభమయింది. ఇటీవలి కాలంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం మరీ ఎక్కువ అయింది. రెండు రోజుల కిందట... రెండో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనలతో.. రెండు పార్టీలు.. మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వరుసగా సవాళ్లు చేసుకుంటున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీతో పాటు తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్ కనుసన్నల్లోనే ఉండేది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పట్టు సడలింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం .. విజయం సాధించి... మళ్లీ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏ మాత్రం తగ్గకుండా... ఎమ్మెల్యే పెద్దారెడ్డిని రాజకీయంగా ఢీకొంటున్నారు.
జేసీ వర్గీయులకు... ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గీయులకు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. దీంతో పోలీసులకు తాడిపత్రి రాజకీయాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎక్కడ పరిస్థితి అదుపు తప్పుతుందోనని అదే పనిగా ఆందోళన చెందుతున్నారు. తాడిపత్రిలో ఎప్పుడూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అందుబాటులో ఉంచుతూంటారు. ఈ రాత్రికి ఏం జరుగుతుందో అనే ఆందోళన పోలీసు వర్గాల్లోనూ ఉంది.