Viral Video: సంతలో కూరగాయల్లా మద్యం అమ్మకం - వైరల్ వీడియో, ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు
Andhra News: ప.గో జిల్లా తణుకులోని సంతలో బహిరంగంగా మద్యం అమ్మడం కలకలం రేపింది. ఈ వీడియో వైరల్ కాగా ఎక్సైజ్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీనిపై మాజీ మంత్రి రోజా ప్రభుత్వాన్ని విమర్శించారు.
Liquor Sale Outside In Tanuku: ఏపీలో నూతన మద్యం పాలసీ రాగానే అక్రమ మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లోకి రాగా.. పలు గ్రామాల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే బహిరంగంగానే బెల్టు షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. తాజాగా, సంతలో కూరగాయలు అమ్మినట్లుగా మద్యం బాటిళ్లు పెట్టి అమ్మడం సంచలనమైంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో (Tanuku) చోటు చేసుకుంది. రెండుచోట్ల ఇలా ముగ్గురు వ్యక్తులు కలిసి బహిరంగంగా మద్యం విక్రయించడం గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వెంటనే రంగంలోకి దిగి వీడియో ఆధారంగా ఓ మహిళతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.8 వేల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో పరారైన మద్యం విక్రయదారులను ఫోటోల సహకారంతో పట్టుకుని అరెస్ట్ చేశారు.
సంత మార్కెట్‌లో మద్యం అమ్ముతున్న షేక్ మున్నా, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్య అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 60 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ మణికంఠరెడ్డి తెలిపారు. దీనిపై 2 కేసులు నమోదు చేశామని.. బెల్టు షాపులకు అనుమతి లేదని.. ఎవరైనా బహిరంగంగా మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదే అదునుగా..
కాగా, తణుకు చుట్టుపక్కల బెల్టు షాపుల దుకాణదారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. నూతన మద్యం పాలసీ అమలులో భాగంగా మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడం వల్ల పలు గ్రామాల్లో దుకాణాలు లేకపోవడాన్ని కొందరు అదునుగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాతవూరు, సంతమార్కెట్, సజ్జాపురం, కోనాల, దువ్వ తదితర ప్రాంతాల్లో బెల్టు షాపులు ఎక్కువగా ఏర్పాటైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంతలో బహిరంగంగా మద్యం అమ్ముతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.
'మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు'
జగనన్న విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే..
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 28, 2024
చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు..
ఈ వీడియో చూడండి...
ఏపీలో బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో..
చిన్నపిల్లల్ని.. విద్యార్థులని పెట్టి మద్యం అమ్మిస్తున్నారు..
ఇది ఎక్కడో కాదు..
చంద్రబాబు కి ఓటేసిన ఆంధ్రప్రదేశ్ లోనే… pic.twitter.com/8UG1ZGT3lK
అటు, ఈ ఘటనపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. సంతలో బహిరంగంగా మద్యం అమ్మడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో చూడండి.. బెల్టు షాపులను ఎలా నిర్వహిస్తున్నారో. చిన్న పిల్లల్ని, విద్యార్థుల్ని పెట్టి మద్యం అమ్మిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఎక్కడో కాదు.. చంద్రబాబుకు ఓటేసిన ఏపీలోనే అని తెలిపారు. 'జగనన్న విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే.. చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ఈ వీడియో చూడండి.. ఇది చంద్రబాబు కి ఓటేసిన ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది జరిగింది. తణుకులో ఇలా విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు వెలిశాయి. టీడీపీ నేతలే మద్యం షాపులు, బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు.. ఇళ్ల మధ్యలో... మహిళలు నడిచే మార్గాల్లో... చిన్నపిల్లల్ని పెట్టి ఇలా మద్యం అమ్ముతున్నారు.. ఇదేనా.. మంచి ప్రభుత్వం..? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి... ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. పిల్లల్ని పెట్టి మద్యం అమ్మించడం భావ్యమేనా..?' అని ట్విట్టర్‌లో నిలదీశారు.