Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం
Thunderstorm: ఏలూరు జిల్లా లింగంపాలెం బోగోలు మండలంలో జామాయిల్ తోటలో కొందరు కూలీలు కర్రలను తొలగిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా పిడుగుపడటంతో నలుగురు కూలీలు మృతి చెందారు.
Eluru Lightning Strike: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి నలుగురు దుర్మరణం చెందారు. వీరంతా వ్యవసాయ కూలీలు. ఏలూరు జిల్లా లింగంపాలెం బోగోలు మండలంలో జామాయిల్ తోటలో కొందరు కూలీలు కర్రలను తొలగిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా పిడుగుపడటంతో నలుగురు కూలీలు మృతి చెందారు. మరికొందరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. తోటి కూలీలు స్థానికుల సహాయంతో గాయపడిన కూలీలను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
లింగపాలెం మండలం బోగోలులో అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న నలుగురు కూలీలు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పిడుగుపాటుకు గాయాలపాలైన వారి విజయవాడలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూలీల మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పిడుగు పడిన సమయంలో అక్కడ మొత్తం 30 మంది వరకు కూలీలు ఉన్నారని సమాచారం.
పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. (Thunderstorm Lightning Dos)
ఉరుములు, మెరుపులో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి
సముద్రము, కొలనులు, సరస్సులు, చెరువుల దగ్గర ఉంటే వెంటనే వాటికి దూరంగా వెళ్లాలి. రేకు, లోహము కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి
ఉరుమలు శబ్ధం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి
కారు, బస్సు లాంటి వాహనాల లోపల ఉన్నట్లయితే వెంటనే అన్ని డోర్స్ మూసి ఉంచాలి
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉన్నప్పుడు మీ మెడ వెనుక జట్టు నిక్కబొడుచుకోవడం గానీ, చర్మం జలదరింపు ఉంటే మెరుపు, పిడుగు రావడానికి సూచనగా భావించండి
బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని.. తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోండి. దీని వలన ఉరుములు, మెరుపులు నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది
ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్లయితే కిటీకీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్ధం ఆగిపోయిన తరువాత కూడా 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండి రక్షణ పొందండి
పిడుగు బాధితులను తాకవచ్చు. వెంటనే వారికి సహాయం అందించండి
పిడుగు బాధితుడిని వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గానీ, ఏదైనా ఆసుప్రతికి తరలించండి
Also Read: Weather Updates: మరో అల్పపీడనం ముప్పు, ఏపీలో ఎఫెక్ట్ ఇలా - తెలంగాణలో 2 రోజులు IMD ఎల్లో అలర్ట్
పిడుగుపాటు సమయంలో చేయకూడనివి..
ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు చెట్ల కింద, చెట్ల సమీపంలో, ఏవైనా టవర్లు, చెరువులు దగ్గర ఉండరాదు
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలు ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు, మొబైల్స్ వాడరాదు
పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండటం లాంటివి చేయకూడదు
మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్తంభాలకు, ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి
వాహనంలో ఉన్నట్లయితే లోహపు భాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు అని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఈ జాగ్రత్తలు సూచించారు.