AP Cockfight: కోడి పందేలు చూసేందుకు వెళ్లి - కోడికత్తి గుచ్చుకుని యువకుడి మృతితో విషాదం
తూర్పు గోదావరి జిల్లాలో నేడు జరిగిన కోడి పందేల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి కత్తి గుచ్చుకుని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
East Godavari A man dies with stabbed by kodi kathi: ఏపీలో సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది కోడి పందేలు, గుండాట, క్యాసినోలు. అయితే పోలీసులు కఠిన ఆంక్షలు విధించడంతో ఈ ఏడాది ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణ చాలా వరకు తగ్గింది. కానీ నేడు జరిగిన కోడి పందేల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి కత్తి గుచ్చుకుని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే..
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలు, గుండాట లాంటివి అధికంగా నిర్వహించేవారు. చుట్టుపక్కల జిల్లాల వారు సైతం ఇక్కడ కోడి పందేలు వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలో నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో కోడి పందేలు విషాదాన్ని నింపాయి. నల్లజర్ల మండలం అనంతపల్లిలో అయ్యప్ప గుడి వద్ద పామాయిల్ తోటలో కోడి పందేలు నిర్వహించారు. బరిలోకి దిగిన కోడి కత్తి తెగి అనంతపల్లి గ్రామానికి చెందిన పద్మరాజు అనే యువకుడు మృతిచెందాడు. కోడికత్తి గుచ్చుకుని రక్తస్రావం అయిన అయన పద్మరాజును నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అతడు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. యువకుడి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
కోడి పందేలపై నేరుగా డీజీపీకే ఫిర్యాదు...
బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఓ అజ్ఞాత వ్యక్తి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన అంశం పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ జాషువా అర్ధరాత్రి ఆ శిబిరంపై తమ సిబ్బందితో కలసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులపాటు పోలీసుల మౌఖిక అనుమతులతో నిర్వహించనున్న కోడి పందాలు, పేకాట, నెంబర్ లాటకు ఎదురు లేకుండాపోయింది. అయితే పోలీసులు వచ్చి హడావిడి చేసిన సమయంలో మాత్రం నిర్వాహకులు కొంచెం సేపు పందాలు ఆపేశారు.
డీజీపీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి అంపాపురంలో క్యాసినో ఏర్పాటు చేసినట్లు, చీర్ గాల్స్ తో పందెం రాయుళ్లకు సకల సౌకర్యాలు చేస్తున్నట్లు వీడియోతో సహా ఆధారాలు పంపినట్లు తెలుస్తుంది. డీజేపీ ఆదేశాల మేరకే జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. శిబిరంలో పూర్తిగా తనిఖీలు చేశామని అమ్మాయిలను తీసుకువచ్చారనే ఆరోపణలు అవాస్తమని ఎస్పీ జాషువా అన్నారు. శిబిరాల వద్ద సమయం దాటినా జనం ఉండటం, కొంతమంది భోజనాలు చేసున్నారని ఏటువంటి పరిస్థితిలో ఈ సమయం వరకు ఉండటానికి వీలు లేదని, అ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు సంఘటనఫై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
ఆకస్మిక తనిఖీకి ముందు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అల్లు నవీన్ నరసింహమూర్తితో ఎస్పీ కొద్దిసేపు చర్చలు జరిపారు. జిల్లా ఎస్పీ అంపాపురం కోడిపందేల స్థావరాన్ని ఆకస్మిక తనిఖీ చేస్తారని సమాచారాన్ని ఆ శాఖలోని సిబ్బంది ముందస్తుగా నిర్వాహకులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసుల ముందస్తు సమాచారంతో ఎస్పీ ఆకస్మిక తనిఖీకి వచ్చే సమయానికి గంట ముందు నిర్వాహకులు యుద్ధ ప్రాతిపదికన లైట్లు ఆర్పివేసి నిర్వహిస్తున్న శిబిరాలన్నీ అప్పటికప్పుడు నిలిపివేసి వెళ్లిపోయారు.