Hyderabad News: పట్టపగలే నడిరోడ్డుపై తాగుతూ యువతీ, యువకుడు హంగామా - చివరకు!
Telangana News: నాగోల్‌లో నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ హల్చల్ చేసిన యువతీ యువకుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. వారిద్దరినీ అరెస్ట్ చేశారు.
Drunken Couple Arrested In Hyderabad: ఓ యువతీ, యువకుడు నడిరోడ్డుపై మందు తాగుతూ హల్చల్ చేశారు. ఇదేంటని ప్రశ్నించిన వాకర్స్‌పై దుర్భాషలాడుతూ వాదనకు దిగారు. ఈ తతంగమంతా స్థానికులు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) నాగోల్‌లో (Nagole) ఓ యువతీ, యువకుడు శుక్రవారం మద్యం మత్తులో నానా హంగామా సృష్టించారు. స్థానిక ఫతుల్లాగూడ ఏరియాలో ఈ జంట కారు దిగి నడిరోడ్డుపైనే మద్యం తాగుతూ కనిపించారు. చేతిలో మద్యం సీసాలతో రహదారిపైనే తాగుతూ అభ్యంతకరంగా ప్రవర్తించారు. వీరిని చూసిన మార్నింగ్ వాకర్స్, స్థానికులు నడిరోడ్డుపై ఇలా చేయడం సరికాదని సూచించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జంట వారిపై దుర్భాషలాడుతూ నానా హంగామా చేశారు. ఈ తతంగమంతా వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అయ్యింది.
యువతీ యువకుడు అరెస్ట్
దీనిపై స్పందించిన పోలీసులు యువతీ యువకుడిని అరెస్ట్ చేశారు. ఉప్పల్ ఫీర్జాదిగూడకు చెందిన అలెక్స్ అనే యువకుడితో పాటు యువతిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులని తెలుస్తోంది. వీరిద్దరిపై పబ్లిక్ న్యూసెన్స్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం యువతికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది.