Divvela Madhuri: 'జనసేన నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు' - టెక్కలి పోలీసులను ఆశ్రయించిన దివ్వెల మాధురి
Srikakulam News: దువ్వాడ శ్రీనివాస్, తనపై జనసేన నేతలు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దివ్వెల మాధురి టెక్కలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
Divvela Madhuri Complaint Against Janasena Leaders: దివ్వెల మాధురి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై, తనపై.. జనసేన నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టెక్కలి పోలీసులకు ఆమె స్థానిక నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
'మానసికంగా వేదనకు గురయ్యా..'
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం దివ్వెల మాధురి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆడవారిపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూస్తామని అన్నారు. 'ముఖ్యంగా జనసేన నేతలు నాపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. దీని వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2 నెలల క్రితం ఇదే పీఎస్‌లో తమకు ప్రాణహాని ఉందని దువ్వాడ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానీ, రెండేళ్ల క్రితం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా విలేకరుల సమావేశంలో దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు చేసిన ఫిర్యాదుపై మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది చాలా దారుణం. పార్టీలకు అతీతంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.' అని మాధురి పేర్కొన్నారు.