ముఖంపై 15 సార్లు కత్తితో పొడిచి జిమ్ ట్రైనర్ దారుణ హత్య - తండ్రే హంతకుడా?
Delhi Crime News: ఢిల్లీలో ఓ జిమ్ ట్రైనర్ దారుణ హత్యకు గురయ్యాడు.
Gym Trainer Killed: ఢిల్లీలో ఓ జిమ్ ట్రైనర్ దారుణ హత్యకు గురయ్యాడు. సౌత్ ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. ఇంట్లో ఉండగానే దుండగుడు దాడి చేసి హత్య చేశారు. ముఖం, ఛాతిపై 15 సార్లు కత్తితో పొడిచారు. మరి కొద్ది గంటల్లో పెళ్లి కావాల్సి ఉంది. ఇంతలోనే ఇంట్లో శవమై కనిపించాడు. అయితే...ఈ హత్య జరిగినప్పటి నుంచి తండ్రి కనిపించకుండా పోయాడు. ఈ హత్యతో అతనికి సంబంధం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి కోసం పలు చోట్ల గాలించిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. మృతుడి పేరు గౌరవ్ సింగల్‌గా గుర్తించారు. ఇప్పటికే సోదరుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
"ఈ హత్యకు కారణమేంటన్నది ఇంకా తెలియలేదు. తండ్రి కొడుకుల మధ్య ఏవో తగాదాలున్నాయని మాత్రం ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన తరవాతే మిగతా వివరాలన్నీ తెలుస్తాయి"
- పోలీసులు
అర్ధరాత్రి 12.30 గంటల సమయానికి పోలీసులకు ఈ హత్యకు సంబంధించిన సమాచారం అందింది. ఈ దాడి జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే బాధితుడు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. పోలీసులు గౌరవ్ సింఘాల్ మృతదేహాన్ని AIIMSకి తరలించి పోస్ట్‌మార్టం జరిపించారు. కుటుంబ సభ్యులెవరిపైనా అనుమానం లేదని బంధువులు చెబుతున్నారు. ఎవరు చంపి ఉంటారన్నది ఊహకు కూడా అందడం లేదని అంటున్నారు. పోలీసులు కచ్చితంగా విచారణ జరిపి నిందితుడిని పట్టుకోవాలని కోరుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు. స్థానికులతో మాట్లాడుతున్నారు. 5 కన్నా ఎక్కువ టీమ్స్ రంగంలోకి దిగాయి.