తన గర్ల్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని ఆఫీసర్‌ని చంపిన క్లర్క్, ఇంట్లోనే పాతిపెట్టి పరారీ
Delhi Crime: గర్ల్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని ఓ క్లర్క్ సీనియర్ ఆఫీసర్‌ని హత్య చేశాడు.
Delhi Crime:
దారుణ హత్య..
ఢిల్లీలో దారుణ హత్య జరిగింది. ఓ 42 ఏళ్ల వ్యక్తిని యువకుడు హత్య చేసి ఇంట్లోనే పాతి పెట్టాడు. ఆ తరవాత దానిపై సిమెంట్ పోసి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు...పోలీసుల విచారణలో దొరికిపోయాడు. సెప్టెంబర్ 2వ తేదీన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..సర్వే ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఆఫీసర్ మహేశ్ కుమార్ ఆగస్టు 29 నుంచి కనిపించకుండా పోయాడు. అదే ఆఫీస్‌లో క్లర్క్‌గా పని చేస్తున్న అనీస్ ఆయనను హత్య చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని, ఆ కోపంతోనే చంపేశానని పోలీసుల ముందు నేరం అంగీకరించాడు. అంతే కాదు. మహేశ్ కుమార్ తన వద్ద రూ.9 లక్షల అప్పు తీసుకున్నాడని, ఇప్పటి వరకూ తీర్చలేదని చెప్పాడు. డబ్బులు ఇవ్వకపోగా తన గర్ల్‌ఫ్రెండ్‌కి దగ్గరయ్యేందుకు చూశాడన్న కోపంతో ఐరన్ పైప్‌తో కొట్టి చంపాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్య చేశాడు నిందితుడు అనీస్. ఆగస్టు 28న వీకాఫ్ తీసుకున్నాడు. మార్కెట్‌కి వెళ్లి ఆరడుగులు పాలిథీన్ షీట్‌తో పాటు పార కొనుగోలు చేశాడు. మరుసటి రోజు మధ్యాహ్నం మహేశ్ కుమార్‌కి కాల్ చేసి ఆర్‌కే పురంలోని తన ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి రాగానే పైప్ రెంచ్‌తో తలపై గట్టిగా కొట్టాడు. ఆ ధాటికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు మహేశ్. హత్య చేసిన వెంటనే అక్కడి నుంచి సోనిపట్‌కి బైక్‌పై వెళ్లాడు. మొబైల్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆగస్టు 29న మళ్లీ ఇంటికి వచ్చి వెనకాల ఓ గొయ్యి తవ్వాడు. రాత్రి పూట ఎవరూ చూడని సమయంలో డెడ్‌బాడీని అందులో వేసి సిమెంట్‌తో కప్పేశాడు. మహేశ్ సోదరుడు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాక కానీ ఇదంతా వెలుగులోకి రాలేదు. ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.