Real Estate: ప్లాట్లు అమ్ముడుపోలేదని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య - సూసైడ్ నోట్ లభ్యం
Real Estate : అప్పులు చేసి అపార్ట్మెంట్ కట్టి, ప్లాట్లు అమ్ముడుపోలేదని మనస్తాపానికి గురైన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

Real Estate : ఏడాదిగా ఎస్టేట్ రంగం మందగించడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. అప్పులు తెచ్చి మరీ కట్టిన ప్లాట్లు అమ్ముడుపోక దివాలా తీసిన ఈ వ్యాపారి.. వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు పెట్టింది పేరు. పలు జిల్లాల నుంచి వచ్చిన వారు సైతం ఇక్కడ ఈ రంగంలో రాణించడం విశేషం. కానీ ఏడాది నుంచి రియల్ రంగంలో స్తబ్దత వ్యాపారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఓ వైపు కట్టిన నిర్మాణాలు అమ్ముడుపోకపోవడం.. మరో పక్క తెచ్చిన అప్పులు.. ఈ రెండూ వారిని ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో చేనేత కార్మికులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చూశాం. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇలాంటి ఘటనలు మొదలైనట్టు తెలుస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లా కొంపల్లిలో నివాసముంటున్న ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి (39) అనే బిల్డర్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ.. ఈ రోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సిరిసిల్లలోని గోపాలపురం గ్రామానికి చెందిన ముత్యాల ఏసురెడ్డి అల్వాల్‌లో స్థిరపడి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఆయన కుమారుడే ఈ వేణుగోపాల్‌రెడ్డి. ఈయన కూడా గత 8ఏళ్లుగా ఈ రంగంలోనే రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన మిత్రులతో కలిసి కొంపల్లి అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టిన వేణుగోపాల్.. సక్సెస్ ఫుల్ గా అమ్మాడు. ఆ అపార్ట్మెంట్ లోనే వేణుగోపాల్ రెడ్డి తన భార్య ప్రణయ, కూతురు ఆద్యలతో కలిసి ఉంటున్నాడు. అంతా బాగుందని అనుకునే సమయంలో కూతురు ఆద్య పేరుతో ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని వేణుగోపాల్ నిర్ణయించుకుని.. రెండేళ్ల క్రితం గుండ్లపోచంపల్లిలో 480 చదరపు గజాల విస్తీర్ణంలో 5 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టాడు. అందుకు పలు బ్యాంకుల నుంచి, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు.
ప్రస్తుతం ఈ నిర్మాణ చివరి దశలో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ అపార్ట్మెంట్ లో 10 ప్లాట్లు అమ్మితే వచ్చిన డబ్బులతో అప్పులు కట్టి, హ్యాపీగా ఉండొచ్చనుకున్న వేణుగోపాల్ కు నిరాశే ఎదురైంది. ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ కేవలం 3 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోవడంతో వేణుగోపాల్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం తన అపార్టుమెంట్ నిర్మాణం వద్ద ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలోనే వేణుగోపాల్‌రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులు తీర్చలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు.
రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత కారణంగా ప్లాట్ల విక్రయం పూర్తిగా నిలిచిపోయిందని, వారం రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో వేణుగోపాల్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడంటూ కుటుంబసభ్యులు చెప్పారు. ఆయన రాసిన సూసైడ్ నోట్ లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసిన పేట్‌బషీర్‌బాగ్ పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు.
Also Read : Tiger News: చిరుత పులిని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం -తీవ్ర గాయాలతో మృతి



















