Cyber Fraud: డిజిటల్ అరెస్టులు అయిపోయాయి.. ఇప్పుడు డిజిటల్ కోర్టులు, జడ్జిలు కూడా - నమ్మారో మునిగినట్లే !
Cyber criminals: సైబర్ నేరగాళ్లు మరో కాన్సెప్ట్ తో తెరపైకి వచ్చారు. డిజిటల్ కోర్టులోత శిక్షలు వేయడం ప్రారంభించారు. కాస్త డబ్బున్న వాళ్లనే టార్గెట్ చేస్తున్నారు.

Cybercriminals come up with another concept Digital courts: డిజిటల్ అరెస్టులు దేశాన్ని కొంత కాలం పాటు గడగడలాడించాయి. ప్రధాని మోదీ లాంటి వాళ్లు కూడా ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డిజిటల్ అరెస్టులు అనేవి లేవని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. మోసం చేయగలినంతమందిని చేసిన తర్వాత ఈ నేరగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. డిజిటల్ అరెస్టుల నుంచి డిజిటల్ కోర్టులు పెట్టేశారు. ఇలా హైదరాబాద్ లోని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కు కోటిన్నరకుపైగా టోకరా వేశారు. క
కేసుల పేరుతో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్‌కు సైబర్ నేరగాళ్ల వల
వనస్థలిపురంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కు ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఒక కేసులో తన పేరు వచ్చిందని, కేసు సుప్రీం కోర్టు జడ్జి స్వయంగా విచారిస్తున్నారని సైబర్ నేరగాళ్లు సమాచారం ఇచ్చారు. దానికి ఆధారాలు అంటూ ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చారు. నిజమో కాదో తెలియదు కానీ.. నేరుగా సుప్రీంకోర్టు జడ్జిఅ అంటున్నారని ఆ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ భయపడిపోయారు.
కోర్టు సెటప్‌తో నకిలీ జడ్జి వీడియో కాల్ - కోటిన్నర జమ చేయాలని ఆదేశం
కాసేపటికి సుప్రీంకోర్టు జడ్జి అంటూ ఓ వీడియో కాల్ వచ్చింది. అంతకు ముందు ఆ సైబర్ నేరగాళ్లు జడ్జీ నుండి వీడియో కాల్ వస్తుందని, మర్యాదగా వ్యవహరించాలని బ్రెయిన్ వాష్ చేశారు. కొద్దిసేపటికి జడ్జీ నుండి వీడియో కాల్ రావడంతో నిజంగానే కోర్టు సెటప్ ఉండటంతో ఆ రిటైర్డ్ ఇంజినీర్ భయపడపోయారు. తన పేరు ఒక పెద్ద కేసులో ఉందని, అరెస్టు చేయాల్సి వస్తుందని ఇంజనీర్ ను నకిలీ జడ్జీ బెదిరించారు. కేసు విషయంలో సుప్రీం కోర్టుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అలా డిపాజిట్ చేస్తే అరెస్టు నుంచి తప్పించుకోవచ్చన్నారు. తప్పు చేయలేదని తేలితే మళ్లీ డబ్బులు వెనక్కి ఇస్తామన్నారు.
ఫ్రాడ్ అని తెలిసి పోలీసుల్ని ఆశ్రయించిన రిటైర్డ్ ఇంజినీర్ -అప్పటికే కోటిన్నర స్వాహా
కేసు ముగిసాక తిరిగి తన అకౌంట్లో పడిపోతాయని చెప్పడంతో, రూ. 1 కోటి 50 లక్షలు డిపాజిట్ చేసిన మాజీ ఇంజనీర్ ... అప్పటికి గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు. ఎన్ని రోజులు గడిచినా డబ్బులు వెనక్కి రాకపోవడంతో, మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ కోర్టు సృష్టించి, వీడియో కాల్ లో నకిలీ జడ్జిని చూపించి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వద్ద రూ.కోటి 50 లక్షలు వసూలు చేయడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల నుంచి డిజిటల్ కోర్టుల వరకూ వచ్చారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.





















