Cyberabad police Update: 'ఖాకీ' స్టైల్ దొంగల ముఠా.. పార్థీ గ్యాంగ్ పేరు చెబితే వణికే...
వరుస చోరీలతో తెలుగు రాష్ట్రాలను వణికిస్తోన్న పార్థీ గ్యాంగ్ ముఠా ఆగడాలకు సైబరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. ఈ ముఠాకు చెందిన 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.
'ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతాం.. పాత బట్టలు కొంటాం..' అంటూ వీధుల్లో తిరుగుతారు. ఇళ్లపై రెక్కీ నిర్వహిస్తారు. అదను చూసుకుని చోరీలకు తెగబడతారు. అడ్డువస్తే దాడి చేయడానికైనా వెనకాడరు. చోరీ చేసిన సొమ్ముతో రాత్రికి రాత్రే రైళ్లలో చెక్కేస్తారు. దొంగతనం చేసిన చోట ఒక్క ఆనవాలు కూడా లేకుండా చేస్తారు. ఇదీ పార్థీ గ్యాంగ్ తీరు. ఏంటిది ఖాకీ సినిమాలో దొంగతనాల సీన్‌లా ఉంది అనుకుంటున్నారా? అవును నిజం వీళ్లు చేసే దొంగతనాలు చూస్తే ఆశ్చర్యపోకమానరు.
పార్థీ గ్యాంగ్.. గత కొన్నేళ్లుగా వరుస దొంగతనాలతో తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. వీళ్ల చోరీలు ఒకటీ రెండూ కాదు.. వందల్లో ఉంటాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లు, ఒంటరిగా ఉంటున్న వారి నివాసాలే వీళ్ల టార్గెట్. ఏళ్లుగా ఈ గ్యాంగ్ చేస్తోన్న చోరీలతో ప్రజలు వణికిపోతున్నారు. కాలానికి తగ్గట్టు వీళ్లు కూడా అప్‌డేట్ అవుతున్నారు. ప్రాంతాలు మారుతున్నా వీరి తీరు మారట్లేదు. ఇటీవల కాలంలో ఈ ముఠాకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు తాజాగా వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో మరోసారి ఈ ముఠా ఆగడాలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది.
రుద్రాక్షలు, మూలికలను అమ్మే వారిలా..
తాజాగా హైదరాబాద్ నగరంలో పట్టుబడిన గ్యాంగ్ సభ్యులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. నగర శివార్లు, నిర్మానుష ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని నివసిస్తుంటారు. పగటి వేళలో రుద్రాక్షలు, ఆయుర్వేద మూలికలను అమ్మే వారిలా సంచరిస్తుంటారు. పగటి వేళల్లో ఏయే ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి? ఒంటరిగా నివసిస్తున్న వారి ఇళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి పూట అదను చూసుకుని చోరీలకు తెగబడతారు. గొడ్డలు, ఇనుప రాడ్లు, కత్తులు వంటి పదునైన ఆయుధాలతో సంచరిస్తుంటారు. చోరీ చేసే సమయంలో ఎవరైనా అడ్డు తగిలితే వారిపై ఆయుధాలతో విరుచుకుపడతారు. ఫోన్ మాట్లాడుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసి ఫోన్లను లాక్కుంటారు. 2020-2021లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ముఠా సుమారు 20 నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో వీరిపై పీడి యాక్ట్ నమోదు చేశారు.
గతంలోనూ జరిగాయి..
పార్థీ గ్యాంగ్ ఆగడాలు 15 ఏళ్ల నుంచి సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్‌ను 2019లోనూ హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.22 లక్షల నగదు, 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మనీషా డిస్కో ఈ ముఠాకు నాయకురాలు. ఆమె భర్త అలీ రజాఖాన్ సహా మరికొంత మంది బంధువులు ఈ టీమ్‌లో ఉంటారు. వీరంతా పగటి సమయంలో కార్లలో తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా రెక్కీ నిర్వహిస్తారు. పక్కా ప్రణాళికతో చీకటి పడగానే దోపిడీ చేస్తారు. దోచిన సొమ్ముతో రాత్రికి రాత్రే రైళ్లలో వెళ్లిపోతారు. 2019లో తార్నాకలో ఇదే తరహా చోరీ జరగడంతో పోలీసులు నిఘా పెట్టి ఈ ముఠాను అరెస్టు చేశారు.
2016లోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడిన పార్థీ ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు అల్ఫనా పవార్ అనే మహిళ నాయకురాలు. వీరి నుంచి 250 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్ధీ ముఠా సభ్యులు ప్రాంతాలకు తగ్గట్లుగా వారి తీరును మారుస్తున్నారు. అనుమానాస్పదంగా ఏవరైనా వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని, వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.