Mahabubabad News: నాడు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపారు - నేడు ఆత్మహత్య చేసుకున్నారు, కుళ్లిన స్థితిలో మృతదేహాలు!
Telangana News: మహబూబాబాద్ జిల్లాలో దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు గత నెల ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
Couple Forceful Death In Mahabubabad: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. గత నెలలో తమ ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి చంపి పరారైన తల్లిదండ్రులు శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అంకన్నగూడేనికి చెందిన దంపతులు అనిల్ (26), దేవి (22).. గ్రామానికి సమీపంలోని అడవిలో శవాలై కనిపించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కుళ్లిన స్థితిలో మృతదేహాలను గుర్తించారు. అనిల్ మృతదేహం చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో లభ్యమైంది. దేవి మృతదేహం కింద పడిపోయి, పుర్రె, ఎముకల చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఈ క్రమంలో వారు ఆత్మహత్య చేసుకుని దాదాపు నెల రోజులు దాటి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లలకు విషమిచ్చి చంపారు
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకన్నగూడెం గ్రామానికి చెందిన అనిల్ కు బయ్యారం మండలం నామాలపాడులోని రాయికుంటకు చెందిన దేవితో దాదాపు ఐదేళ్ల కిందట వివాహం అయ్యింది. వ్యవసాయంతో పాటు ఇటుక బట్టీల్లో పని చేసే అనిల్ తన అత్తవారి గ్రామమైన రాయకుంటలోనే నివాసం ఉంటున్నాడు. వీరికి లోహిత (2), జస్విత (1) ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్చి 10న తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి హత్య చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. అనిల్ తండ్రి వెంకన్న.. అంకన్నగూడెంలోనే చిన్న పాటి కిరాణా షాప్ నడుపుతున్నాడు. అతని ఇంటికి కొడుకు, కోడలు, మనవడు, మనవరాలితో రాగా రోజూలాగే తెల్లవారుజామున దుకాణం తెరిచేందుకు వెళ్లాడు. తిరిగి ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి కొడుకు, కోడలు కనిపించలేదు. చిన్నారులు ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. ఇంట్లో మంచంపై పాల సీసా కనిపించింది. అలాగే, అనిల్, దేవి దుస్తుల బ్యాగ్ దగ్గరలో పురుగుల మందు డబ్బాను గుర్తించారు. తల్లిదండ్రులు పిల్లలకు విషమిచ్చి చంపి పరారై ఉంటారనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు అనిల్, దేవిల కోసం గాలింపు చేపట్టారు. చివరకు వారి మృతదేహాలు కుళ్లిన స్థితిలో అడవిలో కనిపించాయి.
Also Read: Kavitha: కవిత సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్ - అరెస్టుపై కవిత ఏమన్నారంటే?