Crime News: పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ- ఓ కానిస్టేబుల్ మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Road accident in shamshabad | పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఓ లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Constable dies in Road accident in shamshabad | శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ వాహనాలను తనిఖీ చేస్తున్న ఓ పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతిచెందడంతో విషాదం నెలకొంది. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స అందించేందుకు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
లారీ డ్రైవర్ అతివేగంతో దూసుకురావడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన విజయ్ కుమార్ శంషాబాద్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు కానిస్టేబుల్స్‌లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






















