CTR Bank Robbery : డిపాజిట్లు తమ సొంతమేనని స్వాహా ! చిత్తూరు జిల్లాలో బ్యాంక్ సిబ్బంది నిర్వాకం - పోలీసు మార్క్ ట్రీట్‌మెంట్‌తో నిర్వాకం బయటకు !
చిత్తూరు జిల్లా కలికిరిలో ఖాతాదారుల సొమ్మును కాజేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందరూ కుమ్మక్కయి స్కాంకు పాల్పడినట్లుగా గుర్తించారు.
అది పేరుకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్. కానీ అక్కడి సిబ్బంది మాత్రం తమకు తాముగా అదో "ఉత్తుత్తి బ్యాంక్"గా తీర్మానించేసుకున్నారు. అంటే అక్కడ డిపాజిట్లు చేసుకోవడమే కానీ ఇవ్వడాలు ఉండవు.. అలాగే అక్కడ డిపాజిటయ్యే సొమ్ము అంతా ఇష్టానికి వాడుకోవడానికి హక్కు దఖలు పర్చుకున్నారు. అది గ్రామీణ ప్రాంతం కావడంతో ఎక్కువ మంది పెద్దగా చదువు రాని.. చదువులేని ఖాతాదారుల్ని తమ అకౌంట్లో వేసుకుని వారు డబ్బుల్ని ఇష్టారాజ్యంగా వాడుకోవడం ప్రారంభించారు. ఎప్పటికైనా దొంగతనం బయటపడాల్సిందేగా . బయటపడింది. కటకటాల వెనక్కి వెళ్లారు.
Also Read : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య... ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై మృతదేహం గుర్తింపు
చిత్తూరు జిల్లా కలికిరిలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఉంది. అందులో డిపాజిట్లు చేసిన కొంత మందికి ఇటీవలి కాలంలో వారి అకౌంట్లలో డబ్బుల్లేవని సిబ్బంది చెప్పడం ప్రారంభించారు. బ్యాంకులో డబ్బుల్లేవా.. తమ అకౌంట్లలో డబ్బుల్లేవా అనేది వారికి అర్థం కాలేదు. బ్యాంకులో డబ్బుల్లేవేమోనని కొన్నాళ్లు తిరిగారు. అయితే అసలు విషయం చివరికి చెప్పే సరికి వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అకౌంట్లలో నగదు మాత్రమే కాదు బంగారు నగల రుణాల విషయంలోనూ అదే విధిగా గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. చివరికి బాధితులంతా తిరగబడేసరికి వారిని బెదిరించడానికి రుబాబు కూడా చేశారు. కానీ రూపాయి రూపాయి కూడబెట్టుకున్న కష్టం బ్యాంక్ పాలవుతుందన్న ఉద్దేశంతో వారు తిరగబడ్డారు. చివరికి పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది.
Also Read : మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీకి 8వ స్థానం.. ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి
పోలీసులు బ్యాంక్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి మొత్తం బ్రాంచి అకౌంట్లు ఖాతాల్లో ఉన్న సొమ్ము.. ఎవరు ఎవరు ఎంత నొక్కేశారు వంటి వివరాలన్నీ బయటకు తీశారు. మొత్తంగా ఖాతాదారుల సొమ్ము రూ. కోటి 70లక్షలు బ్యాంక్ సిబ్బంది వాడేసుకున్నారని తేలింది. 20 రోజుల పాటు అకౌంట్లన్నీ లెక్కలు చూశారు. చివరికి స్కాం బయటపడటంతో పదకొండు మంది బ్యాంకు ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ఈ స్కాం చేసేందుకు సహకరించిన మరో ఐదుగురు బయట వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేశారు. వవీరి వద్ద నుంచి గుర్తించారు..వీరి వద్ద నుండి యభై లక్షలు విలువ చేసే బంగారు నగలు, ఇరవై లక్షలు నగదును పోలీసులు రికవరీ చేశారు.
Also Read : పాపులారిటీ కోసం నడి రోడ్డుపై ట్రాఫిక్ ఆపేసి రచ్చ చేసింది, ఇప్పుడు చిక్కుల్లో పడింది..
బ్యాంకులో దాచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చన్న భరోసా ప్రజలకు ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని మోసం చేసే బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య అంతకంతకూ ఎక్కువవుతూనే ఉంది. ఒక చోట బ్యాంక్‌కే కన్నం పెడితే.. ఇంకో చోట ఖాతాదారులకు కన్నం పెడుతున్నారు. దొరికినప్పుడే దొంగలవుతున్నారు. అప్పటి వరకూ దొరలుగానే చెలామణి అవుతున్నారు. దాచుకున్న ప్రజల సొమ్మును దోచుకు తింటున్నారు.