Chittoor Crime : కన్న కూతురిపై అత్యాచారం కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, ఫోక్సో కోర్టు సంచలన తీర్పు
Chittoor Crime : కన్న తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన అది. ఈ కేసులో ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Chittoor Crime : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు అమలుచేస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు జరగుతూనే ఉన్నాయి. ఒంటరిగా బయటకు పంపాలన్నా, తోడు పెట్టి పంపాలన్నా భయపడే పరిస్ధితులు నెలకొంటున్నాయి. భద్రతగా, బాధ్యతగా మెలగాల్సిన కన్న తండ్రే రక్తం పంచుకు పుట్టిన కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడి చేసిన ఘటన 2018లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. కుమార్తెను కామాంధుడిగా మారిన భర్త నుంచి కాపాడాల్సిన కన్న తల్లి కుమార్తెపై లైంగిక దాడి చేసేందుకు సహకరించడంతో బాధిత బాలిక చిన్నాన్న, అవ్వను ఆశ్రయించడంతో ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది. నాలుగు సంవత్సరాలుగా కోర్టులో వాదోపవాదనలు జరిగి ఇవాళ చిత్తూరు ఫోక్సో కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ, వెయ్యి రూపాయలు జరిమానా విధించింది.
అసలేం జరిగింది?
చిత్తూరు జిల్లా, పలమనేరు మండలానికి చెందిన కృష్ణమూర్తి, ధనమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఓ కుమార్తె ఉంది. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో కృష్ణమూర్తి, ధనమ్మ దంపతులు ఎంతో గారాభంగా చూసుకునేవారు. అయితే మద్యానికి బానిసగా మారిన కృష్ణరాజు మృగంలా మారిపోయాడు. ఈ క్రమంలో కృష్ణమూర్తికి తన రక్తం పంచుకుని పుట్టిన పదేళ్ల కుమార్తెపై కన్ను పడింది. ఎలాగైనా కుమార్తెతో తన కామవాంఛ తీర్చుకోవాలని భావించిన కృష్ణమూర్తి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెను భయపెట్టి లైంగికంగా దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. కన్నతండ్రే తన పాలిట కామంతో లైంగికదాడి చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయపడుతూ విషయాన్ని ఇంటికి వచ్చిన తల్లికి చెప్పింది. కన్న కుమార్తెపై లైంగిక దాడి చేసిన తండ్రిని మందలించాల్సిన తల్లే భర్తకు సహకరిస్తూ మూడేళ్ల పాటు కుమార్తెపై భర్త కామ కోరికలు తీర్చుకునేందుకు సహకరించింది.
కన్నవారే క్రూరంగా
కన్నవారే తన పాలిట క్రూరంగా ప్రవర్తించడం తట్డుకోలేని ఆ పదేళ్ల బాలిక తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో చిన్నాన్న, అవ్వకు విషయం చెప్పి బోరున కన్నీళ్లూ పెట్టుకుంది. అయితే విషయాన్ని తెలుసుకున్న చిన్నాన్న, అవ్వలు బాలికను నేరుగా సీడబ్ల్యూసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ అధికారులు విచారణ చేసి పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పలమనేరు పోలీసులు కృష్ణమూర్తి, ధనమ్మలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. బాలికపై మూడు సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడిన సాక్షాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున కేసును వాదించిన పబ్లిక్ ప్రసిక్యూటర్ లీలావతి వాదనతో పోక్సో కోర్టు న్యాయమూర్తి శాంతి ఏకీభవించారు. నేరం రుజువు కావడంతో నిందితులైన కృష్ణమూర్తి, ధనమ్మలకు జీవిత ఖైదు విధిస్తూ, వెయ్యి రూపాయలు జరిమానా విధించింది కోర్టు. అంతే కాకుండా బాలికకు మూడు లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పును ఇచ్చింది.
Also Read : Jublie Hills Case : ఆ నలుగురూ మైనర్లు కాదు మేజర్లే - ఎమ్మెల్యే కొడుకు మాత్రం సేఫ్ !
Also Read : Rajahmundry News : స్పందనలో వెరైటీ ఫిర్యాదు, నాలుగు గంటలు శ్రమించి పట్టుకున్న సిబ్బంది!