Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ మంత్రివర్గం ములుగు జిల్లాలోని మేడారంలో తొలిసారి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

మేడారం: గడువు తీరిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 27వ కేబినెట్ సమావేశాన్ని గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క సన్నిధి మేడారంలో నిర్వహించుకోవంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన 14 ప్రాంతాలలో, అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలలో ప్రభుత్వ భూములు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదించినట్లు తెలిపారు. నల్గొండలో కట్టే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావొచ్చు. మహబూబ్ నగర్ లో కట్టే మరో కార్పొరేట్ ఆఫీసుకు స్థలాలు కేటాయించినట్లు చెప్పారు.
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్ల టైం పూర్తయింది. కనుక సాధ్యమైంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గోదావరి పుష్కరాలు 2027 జులై 27 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించనున్నాం. ఇప్పటినుంచే మంచి ప్రణాళికతో పుష్కరాలు నిర్వహించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.
బాసర నుంచి భద్రాచలం వరకు పురాతన ఆలయాలను టెంపుల్ సర్క్యూట్ గా ఏర్పాటు చేసి ఎకో ఫారెస్ట్, ఎకో టూరిజం లాంటివి అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. టెంపుల్ సర్క్యూట్ కు ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి వారు ఇచ్చే రిపోర్టులో కేబినెట్ సబ్ కమిటీ ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్ 2
హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ చేయడంపై చర్చించాం. ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ హైదరాబాద్ మెట్రో భూ సేకరణ చేయాలని తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2787 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ లోని ట్రిపుల్ సీ నుంచి శిల్పా లే అవుట్ వరకు దాదాపు 9 కిలోమీటర్ల రోడ్డు హై లేవెల్ బ్రిడ్జిని నిర్మించడానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారంను అభివృద్ధి చేసింది. ఆ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 19న ప్రారంభించనున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆధ్యాత్మికంగా ఇది గిరిజనులు, ఆదివాసీలకే కాదు.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యదైవంగా ఉంది. ఇలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొన్నారు. కుంభమేళా, తిరుపతిని గుర్తుచేసేలా ఈ మేడారం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
11 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం.. మహాత్మగాంధీ వర్సిటీలో కొత్త కోర్సులు
రెండేళ్ల తరువాత తెలంగాణలో మట్టి రోడ్లు కనిపించవని, తెలంగాణ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నాను కానీ తొలిసారి చారిత్రాత్మక కేబినెట్ భేటీ మేడారం సన్నిధిలో జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి. మారుమూల ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు కొలిచే మేడారంలో కేబినెట్ భేటీలో పాల్గొనడాన్ని అదృష్టంగా భావిస్తా అన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా 6 వేల కిలోమీటర్ల పైగా రోడ్లను 11,334 కోట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి 6 వేల కోట్లతో గ్రామాల నుంచి మండల కేంద్రాలకు , మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు చర్చించి నిర్ణయం తీసుకున్నాం.
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ తరువాత వైఎస్సార్ హయాంలో ఏర్పాటు చేసిన మహాత్మగాంధీ యూనివర్సిటీ కాలేజీలో ఎంబీఏ, బీటెక్ కోర్సులున్నాయి. ఇప్పుడు యూనివర్సిటీలో లా కోర్సులు, ఫార్మసీ కోర్సు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమయ్యే పోస్టులను కూడా మంజూరు చేసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రెండున్నర నెలల కాలంలో సమ్మక్క సారలమ్మ మేడారాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు.
ములుగు మండలం కోసం ప్రత్యేక లిఫ్ట్.. వేల ఎకరాలకు నీళ్లు
మేడారం ఆలయం అభివృద్ధికి సెప్టెంబర్ నెలలో మాస్టర్ ప్లాన్ విడుదల చేయగా, ఆ తరువాత వర్షాలతో ఇబ్బంది అయినాసాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేశామన్నారు మంత్రి సీతక్క. గతంలో ములుగులో నీళ్లు పారుతున్నాయి కానీ మాకు నీళ్లు రావడం లేదని ఎన్నోసార్లు పోరాటం చేశాం. ఈరోజు ములుగు మండలంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి మరో 15, 20 వేల ఎకరాలకు నీళ్ళు అందించే పనులు చేయడానికి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 143 కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేసి, ములుగు మండలంలో వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. రామప్ప చెరువు నుంచి లక్నరంలోకి పైపులైన్ ఇస్తానని సీఎం రేవంత్ మాటిచ్చారు. 30, 35 కోట్లతో పనులు జరుగుతాయి. ఆ నీళ్లు ఏడాది పొడవునా జంపన్న వాగులో ప్రవహిస్తాయని సీతక్క అన్నారు.






















