యమహా R2 నుంచి ఎలక్ట్రిక్ ఏరోక్స్ వరకు - 2026లో లాంచ్ కానున్న యమహా బైక్స్, స్కూటర్లు ఇవే
2026లో భారత్‌లో యమహా విడుదల చేయనున్న కొత్త బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇవి. R2 స్పోర్ట్‌బైక్, EC 06, Aerox E, Nmax 155 గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Upcoming Yamaha Bikes 2026 India: భారత్‌లో తన ఉనికిని మరింత బలంగా చాటే దిశగా యమహా మోటార్ ఇండియా 2026 సంవత్సరానికి గట్టి ప్లాన్‌తో ముందుకు వస్తోంది. గత ఏడాది XSR 155 ని మార్కెట్లోకి తీసుకొచ్చిన యమహా, ఇప్పుడు స్పోర్ట్ బైక్ సెగ్మెంట్‌తో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోనూ పెద్ద అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఈ బ్రాండ్ నుంచి, ఈ ఏడాది (2026లో) రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఒక కొత్త స్పోర్ట్ బైక్ భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2026 యమహా ఎలక్ట్రిక్ స్కూటర్లు
యమహా భారత్‌లోకి ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రవేశించేందుకు రెండు వేర్వేరు మార్గాలను ఎంచుకుంది. అందులో మొదటిది EC 06. ఈ స్కూటర్ రివర్ ఇండీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించారు. ఇప్పటికే దీని ఉత్పత్తి ప్రారంభమైందని సమాచారం. EC 06లో 4kWh బ్యాటరీ ఉంటుంది. కంపెనీ తెలిపిన ప్రకారం దీని IDC రేంజ్ సుమారు 160 కిలోమీటర్లు. నగర ప్రయాణాలకు ఇది చాలా ఉపయోగకరమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా యమహా భావిస్తోంది.
రెండోది Aerox E. ఇది పూర్తిగా యమహానే స్వయంగా డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్. డిజైన్ పరంగా ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Aerox మాదిరిగానే స్పోర్టీ లుక్‌తో రానుంది. ఇందులో 3kWh బ్యాటరీ ఇవ్వనున్నారు. దీని క్లెయిమ్ చేసిన IDC రేంజ్ 106 కిలోమీటర్లు. ఎక్కువ ఫీచర్లు, యువతను ఆకట్టుకునే స్టైలింగ్ దీనికి ప్లస్ పాయింట్లుగా మారనున్నాయి.
ICE స్కూటర్ - Nmax 155
ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పెట్రోల్ స్కూటర్ విభాగాన్ని కూడా యమహా వదలడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో మంచి పేరు తెచ్చుకున్న Nmax 155 ను భారత్‌కు తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ స్కూటర్ 2026 రెండో అర్ధభాగంలో లేదా 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో ఇది యమహాకు కీలక మోడల్‌గా మారవచ్చు.
2026 యమహా R2 స్పోర్ట్ బైక్
బైక్ ప్రియుల కోసం యమహా పెద్ద సర్‌ప్రైజ్‌గా కొత్త R2 స్పోర్ట్ బైక్‌పై పని చేస్తోంది. ఇది R15 కంటే పైన ఉండే మోడల్. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ బైక్ పూర్తిగా భారత్‌లోనే డిజైన్, డెవలప్ అవుతోంది. R2 లో సుమారు 200cc లేదా కొంచెం ఎక్కువ సామర్థ్యం ఉన్న కొత్త ఇంజిన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పెర్ఫార్మెన్స్ పెంచుతూనే, మంచి మైలేజ్ కూడా అందించేలా యమహా దీనిని ట్యూన్ చేయనుంది. ఈ బైక్ చెన్నైలోని యమహా ఫ్యాక్టరీలోనే తయారు కానుంది. 2026 పండుగ సీజన్ నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.
మొత్తం మీద, 2026 యమహాకు భారత మార్కెట్‌లో చాలా కీలక సంవత్సరం కానుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ప్రీమియం ICE స్కూటర్, కొత్త స్పోర్ట్‌బైక్‌తో యమహా తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. సిటీ యూజర్ల నుంచి యంగ్ బైక్ లవర్స్ వరకు అందరినీ ఆకట్టుకునేలా ఈ కంపెనీ ప్లాన్ చేసింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















