Chittoor Road Accident: దైవదర్శనానికి బయలుదేరిన కొన్ని నిమిషాలకే దంపతులు దుర్మరణం
Couple Dies in Road Accident in Chittoor District: చిత్తూరు జిల్లాలో దైవ దర్శనానికి ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
Couple Dies In Road Accident in Chittoor : ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో దైవ దర్శనానికి ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లాలో కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గత కొన్నిరోజులుగా ఉదయం వేళ పొగమంచు ప్రభావంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు సూచించారు.
దైవ దర్శనానికి బయలుదేరిన నిమిషాల్లోనే విషాదం
చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో భార్యాభర్తలు ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పూతలపట్టు మండలం, తిమ్మిరెడ్డిపల్లికి చెందిన భార్యాభర్తలు కాణిపాకం వినాయకుడిని దర్శించుకోవాలనుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన వద్ద భార్యాభర్తలు బస్ స్టాప్ వద్దకు నడిచి వెళుతుండగా పీలేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన భార్యాభర్తలను తిమ్మిరెడ్డిపల్లికి చెందిన చెంగల్ రెడ్డి, కస్తూరిగా గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని పరిశీలించారు. 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చిన తరువాత స్థానికుల సహాయంతో సిబ్బంది 108లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరిని ఢీకొట్టిన కారు వివరాలు సేకరించే ప్రయత్నం మొదలుపెట్టారు.
కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి
కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వృద్దురాలు అక్కడికక్కడే మృతి చెందగా, అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. అతడ్ని చికిత్స నిమిత్తం విజయవాడలోని కామినేని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వారు కాకినాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మాండౌస్ తుపాను ప్రభావంతో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీవారి కొండ తడిసి ముద్దయింది.కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిలిపివేసింది. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను తితిదే మూసివేసింది. భారీ స్థాయిలో కురుస్తోన్న వర్షాలకు తిరుమలలోని అన్ని జలాశయాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వెళ్లే భక్తులను తితిదే అనుమతించడంలేదు.