Case On Punch Prabhakr : ఉపరాష్ట్రపతి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పంచ్ ప్రభాకర్‌రెడ్డిపై ఢిల్లీలో కేసులు..!
వైఎస్‌ఆర్‌సీపీని వ్యతిరేకించే వాళ్లపై బూతులు, తిట్లతో విరుచుకుపడే ప్రభాకర్ రెడ్డిపై ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. స్పీకర్, ఉపరాష్ట్రపతిపై అసభ్య పదజాలం వాడారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.
![Case On Punch Prabhakr : ఉపరాష్ట్రపతి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పంచ్ ప్రభాకర్‌రెడ్డిపై ఢిల్లీలో కేసులు..! Cases in Delhi against NRI Prabhakar Reddy for making indecent remarks against those in constitutional positions Case On Punch Prabhakr : ఉపరాష్ట్రపతి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పంచ్ ప్రభాకర్‌రెడ్డిపై ఢిల్లీలో కేసులు..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/f977c05b0cc5291bd4bbd528c0122ad1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రవాసాంధ్రుడు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచ్ ప్రభాకర్ రెడ్డిపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాలను అనుచిత భాష ఉపయోగిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పెడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు న్యాయసలహా తీసుకున్నారు. స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు. యూట్యూబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు.
చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానభూతిపరుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఏపీ సీఎం జగన్‌ను విమర్శించే వారిపై ఆయన విరుచుకుపడతారు. అసభ్యమైన పదజాలంతో తిట్లు లంకించుకుంటారు. హోదాలను కూడా చూసుకోకుండా ఇష్టారీతిన మాట్లాడతారు. అయితే ఆయన సాధారణ రాజకీయ నేతల్ని విమర్శించడానికి .. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని విమర్శించడానికి తేడా తెలుసుకోలేకపోయారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న వెంకయ్యనాయుడిపైనా అదే ఘాటు పదజాలం ఉపయోగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ... తమ రెబల్ ఎంపీ రఘురామపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ ఓంబిర్లాకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆయినా నిర్ణయం తీసుకోలేదని ఓ సారి విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో అమెరికా నుండీ చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి స్పీకర్‌ను సైతం దారుణంగా తిడుతూ వీడియో తీసి .. యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ రోజూ ప్రెస్‌మీట్లు పెట్టే రఘురామకృష్ణరాజుపై ఆయన విరుచుకుపడే విధానం వేరుగా ఉంటుంది. ఈ వీడియోలన్నింటినీ డౌన్ లోడ్ చేసిన రఘురామకృష్ణరాజు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులపై చర్యలు తీసుకున్నారు. కొన్నాళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో జరిగిన దాడి అంశంలోనూ ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అప్పట్లో హైకోర్టు న్యాయమూర్తులపైనా అదే తరహా భాషను ప్రయోగించారు. ఇలా న్యాయమూర్తుల్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 90మందికిపైగా అప్పట్లో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారిలో ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆయన విదేశాల్లో ఉండటంతో ఇంటర్ పోల్ సాయం తీసుకుని దర్యాప్తు చేయాల్సి ఉందని భావిస్తున్నారు.
ఢిల్లీ పోలీసులు కోర్టు అనుమతి తీసుకునే కేసు నమోదు చేశారు. యూట్యూబ్ నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఎక్కడి నుంచి వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు.. వంటి విషయాలపై క్లారిటీ వచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసి ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే న్యాయమూర్తులపై దూషణలల కేసుల్లో పలువురు వైసీపీ కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు. ఐదుగురు అరెస్టయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)