Crime News: బాలున్ని కట్టేసి గొంతు కోసి చంపేశారు - మేనమామే కాలయముడు, సత్యసాయి జిల్లాలో ఘోరం
Andhra News: సత్యసాయి జిల్లాలో ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుని మేనమామే అతన్ని కిడ్నాప్ చేసి నోట్లో గుడ్డలు కుక్కి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు.
Boy Brutally Murdered In Satyasai District: సత్యసాయి జిల్లాలో (Satyasai District) ఘోరం జరిగింది. గురువారం కిడ్నాప్‌నకు గురైన బాలుడు శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు. దుండగులు బాలుని కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి గొంతు కోసి చంపేశారు. అయితే బాలుని మేనమామే అసలు నిందితుడని పోలీసు విచారణలో వెల్లడైంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యసాయి జిల్లా ఆముదాలగుంది గ్రామానికి చెందిన చేతన్ జిల్లా జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గురువారం స్కూల్ టైం దాటిపోయినా బాలుడు ఇంటికి రాలేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
మేనమామే చంపేశాడు
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుని కోసం వెతుకులాట ప్రారంభించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇంతలోనే శుక్రవారం తెల్లవారుజామున మడకశిర - కర్ణాటక సరిహద్దులో ఓ బాలుడి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ మృతదేహం అదృశ్యమైన చేతన్‌కుమార్‌దేనని గుర్తించారు. బాలుని చేతులు, కాళ్లు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వారిలో చేతన్ మేనమామ ఉన్నట్లు గుర్తించారు. ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా నిందితుడు సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. మొత్తం ఇద్దరం హత్య చేసినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. బాలుని మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.