Shamshabad airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు-పొరపాటైందంటూ మరో మెయిల్
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టాలంటూ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాసేపటికే... పొరపాటు జరిగిదంటూ మరో మెయిల్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. విమానం ఎక్కేవారు.. దిగేవారు అందరినీ తనిఖీ చేశారు. లగేజ్‌లన్నీ స్కాన్ చేశారు. ఎయిర్‌పోర్టు అంతా ముమ్మరంగా తనిఖీలు చేశారు.
సోమవారాం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ రాగా.. విషయం ఆలస్యంగా బయటపడింది. నిన్న ఉదయం 11గంటల 50 నిమిషాలకు గుర్తుతెలియని వ్యక్తి విమానాశ్రయంలో బాంబు ఉందంటూ కంట్రోల్ రూమ్‌కు మెయిల్ పెట్టాడు. రాత్రి 7గంటలకు బాంబు పేలుతుందని చెప్పారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ పెంచారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు నిర్వహించారు. చివరకు ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు.
బెదిరింపు మెయిల్ వచ్చిన కాసేపట్లో.. మరో మెయిల్ వచ్చింది. తప్పు జరిగిందని.. తన కుమారుడు ఫోన్‌తో ఆడుకుంటూ మెయిల్, మెసేజ్‌లు పెట్టాడంటూ వేరే ఐడీతో మెయిల్ పెట్టాడు గుర్తుతెలియని వ్యక్తి. అంతేకాదు... తనను క్షమించాలంటూ కోరాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎయిర్‌పోర్ట్ అధికారులు. ఎయిర్‌పోర్టు కంట్రోల్ రూమ్‌కి వచ్చిన మెయిల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. రెండు మెయిల్స్ పెట్టింది ఒక వ్యక్తే కాదా...? అన్నది కాదా అన్నది ఆరా తీస్తున్నారు. ఎందుకు ఇలా మెయిల్ పెట్టారు..? ఎవరు పెట్టారు..? అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. కేసు కూడా నమోదు చేశారు.
అయితే, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చాలా సార్లు ఇలా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మెయిల్ రాగానే... అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేయడం.. ఆ తర్వాత అది ఉత్తిదే అని తేలడం జరిగింది. ఇప్పుడు పెట్టిన ఆ మెయిల్ కూడా ఇలాంటిందే అని తేల్చారు ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు. నిన్న వచ్చిన బెదిరింపు మెయిల్ గురించి వెంటనే బయటపెడితే ప్రయాణికులు కంగారు పడతారని రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.