Bapatla Volunteer Murder : మహిళా వాలంటీర్ మర్డర్ కేసులో నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య
Bapatla Volunteer Murder : బాపట్ల జిల్లా వేమూరులో మహిళా గ్రామ వాలంటీర్ హత్య కేసులో నిందితుడైన పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు. నిడుబ్రోల్ రైల్వే స్టేషన్ లో డబుల్ డెక్కర్ రైలు కింద పడి అతడు సూసైడ్ చేసుకున్నాడు.
Bapatla Volunteer Murder : బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి గ్రామంలో ఈనెల 15న వాలంటీర్ శారదను హత్య చేసిన పద్మారావు(35) ఆత్మహత్య చేసుకున్నాడు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్ లో తిరుపతి నుంచి విశాఖ వెళ్తోన్న డబుల్ డెక్కర్ రైలు కింద పడి పద్మారావు సూసైడ్ చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ మృతదేహం పద్మారావుదేనని ఆయన కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ ఘటనపై తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
బాపట్ల జిల్లాలో ఇటీవల ఓ మహిళా గ్రామ వాలంటీర్ దారుణ హత్యకు గరుయ్యారు. వేమూరు మండలంలో ఈ దారుణం జరిగింది. మండలంలోని చావలి గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద (27) వివాహిత కాగా, భర్త ధర్మారావు, సంతానం ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శారద చావలిలో గ్రామ వాలంటీర్‌గా సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం(మే 15) నాడు శారద దారుణ హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన పద్మారావు అనే వ్యక్తి దాడి చేసి మెడపై కత్తితో కోసాడు. భయంతో కేకలు వేసుకుంటూ రోడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చిపడిపోయింది శారద. చుట్టుపక్కల వారు ఈ విషయాన్ని గమనించి 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే సమయానికే ఆమె ప్రాణాలు విడిచింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో పద్మారావు ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
వివాహేతర సంబంధమే కారణమా?
వివాహిత అయిన శారదకు గ్రామానికి చెందిన పద్మారావుతో పరిచయం ఉంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత కొంతకాలం నుంచి వీరు శారీరక సంబంధాన్ని కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన పద్మారావు శారదను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడని సీఐ కళ్యాణ్ రాజ్ తెలిపారు. మహిళా గ్రామ వాలంటీర్ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రశాంతంగా ఉండే చావలిలో ఇటువంటి దారుణ హత్య జరగడంతో గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త