(Source: ECI/ABP News/ABP Majha)
Theft: సినిమా రేంజ్‌లో దొంగల మాస్టర్ ప్లాన్.. అంతకు మించి తెలివి చూపిన ఖాకీలు, గంటలోపే పట్టేసి..
దొంగలు సినిమా లెవల్లో దొంగతనం చేశామనుకొన్నారు. కానీ, అదే సినీ ఫక్కీలో పోలీసులకు దొరికిపోయారు.
పక్కా స్కెచ్ వేశారు.. నెలల తరబడి రెక్కీ నిర్వహించారు. ఏ సమయంలో డబ్బులతో బయలుదేరుతారో పక్కా సమాచారం రాబట్టారు. అంతా అనుకొన్నట్లే చేశామనుకొన్నారు. కానీ పోలీసులు అంతకుమించి తెలివిగా రియాక్ట్ అయ్యారు. చోరీ చేసిన గంటలోపే దొంగల తెలివికి చెక్ పెట్టారు. అంతా సినిమా స్థాయిలో ప్లాన్ చేస్తే.. అదే సినిమాను మించిన స్థాయిలో పోలీసులు కూడా చెక్ పెట్టి దొంగలకు చుక్కలు చూపించారు. చోరీ చేసి డబ్బుల నోట్ల కట్టలు ఇంకా లెక్కించక ముందే కటకటాలను లెక్కపెట్టాల్సి వచ్చింది ఆ దొంగలకు. పూర్తి వివరాలివీ..
అనంతపురానికి సరిహద్దున ఉన్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా కేంద్రంలో ఓ చోరీ ఘటన జరిగింది. ఈ సంఘటనతో బళ్ళారిలో ఉదయమే హడావిడి చెలరేగింది. దొంగతనం జరిగిందన్న సమాచారం ప్రజలకు చేరేలోపే వారిని పట్టుకొన్నాం అన్న పోలీసుల ప్రెస్ మీట్ కూడా ప్రజలకు అంతులేని ఆశ్చర్యానికి గురిచేసింది.
బళ్ళారిలో ఒక బంగారం దుకాణంలో పనిచేసే మెహబూబా అనే వ్యక్తి రూ.41 లక్షలు తీసుకొని బస్టాండ్ కు బయలదేరాడు. కానీ మోతీ సర్కిల్ కు చేరుకొనేలోపు ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ పై దూసుకువచ్చి కత్తితో దాడి చేసి, డబ్బుల సంచి లాక్కొని వెళ్లారు. వెంటనే నిందితుడు గాయాలతో దగ్గర్లోనే వున్న బ్రూస్పేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగింది చెప్పారు. అలర్ట్ అయిన పోలీసులు జరిగిన దొంగతనం గురించి అనౌన్స్ చేశారు. ఎస్పీకి సమాచారం అందిన వెంటనే డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో బళ్ళారి పట్టణంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గాయపడ్డ బాధితుడిని వెంటనే హాస్పటల్ కు తరలించారు.
మొహబూబా కదలికలపై నిఘా వుంచిన వ్యక్తులే ఈ దొంగతనానికి స్కెచ్ వేసుంటారని అంచనాకు వచ్చిన పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు నిందితులు ఎవరో తెలిసిపోయింది. ఇంకేముంది దొంగతనం చేసిన నోట్ల కట్టలను లెక్కించకముందే ఊసలు లెక్కించేలా చేశారు బళ్ళారి పోలీసులు. బళ్ళారి ఎస్పీ సైదులు విషయం తెలిసిన వెంటనే రోడ్ పైకి వచ్చేశారు.
నైట్ బీట్ సిబ్బంది ఇళ్లకు వెళ్లకుండా బళ్ళారి నగరాన్ని రౌండప్ చేసేశారు. దీంతో దొంగలకు ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్న సమయంలోనే పోలీసులు పట్టేసుకొన్నారు. నిందితులంతా బళ్లారి నగరానికి చెందినవారే. అందరూ కూడా బాధితుడి కదలికలపై నిఘా వేసి చోరీకి పాల్పడ్డారు. నిందితులు కూడా బాధితుడి బంగారు షాపునకు దగ్గర్లోనివారు అని పోలీసులు చెప్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రూ.41 లక్షలను స్వాదీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేసినట్లు బళ్ళారి ఎస్పీ సైదులు అడావత్ ప్రకటించారు. చోరీ జరిగిన గంటలోపే నిందితులు అరెస్ట్ చేసి డబ్బులను రికవరీ చేయడంతో బళ్ళారిలో పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు.
Also Read: నెల్లూరులో పుష్ప ఛేజింగ్ సీన్.. మామూలుగా లేదు..
Also Read: ఓఆర్ఆర్ వద్ద ఇద్దరు యువకులు, యువతి.. ముగ్గురూ కలిసి కారులో.. అడ్డంగా బుక్
Also Read: ఈ ఊర్లో లిక్కర్ అమ్మితే రూ.లక్ష, కొనాలంటే రూ.50 వేలు.. నాలుగేళ్ల నుంచి ఇంతే..