Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు, ఏడుగురు దుర్మరణం, నవ జంట కారు బోల్తా
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు నెత్తురోడింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. కర్నూలు జిల్లాలో కారు ఆగిఉన్న లారీ ఢీకొట్టింది. సూర్యాపేట జిల్లాలో రెండు బైక్ లు ఢీకొని నలుగురు మరణించారు.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు కర్నూలుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బంధువులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా పరామర్శించేందుకు కర్నూలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. కుమార్, ఆంజనేయులు, ధరణికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీనివాసులు, ఆదిలక్ష్మి, భాగ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. ఉలిందకొండ ఎస్.ఐ. శరత్ కుమార్ రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించి సలహాచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయాలైన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
నవ జంటకు తీవ్రగాయాలు
కృష్ణాజిల్లా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో నవ జంటకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి కాకినాడలో వివాహం అయిన కొత్త జంట ఆదిత్య, శ్రావణి కుటుంబ సభ్యులతో కలిసి మచిలీపట్నం వస్తున్నాకు. కౌతవరం గ్రామం వద్ద మంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనపడక కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాల్వలో బోల్తా కొట్టింది. అయితే కొత్త జంట కారులో ఉన్న ఇతర కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాళ్లపారాణి ఆరకముందే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు షాక్ లో ఉన్నారు. 108 వాహనం ద్వారా గాయపడినవారిని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.
సూర్యపేటలో బైక్ లు ఢీకొని నలుగురు మృతి
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం నశింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్ లు ఢీకొని నలుగురు యువకుల దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రెండు బైక్ ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతులు బానోతు అరవింద్ (తెట్టేకుంట తండా), బుక్య నవీన్(బోత్యా తండా), ధరావత్ ఆనంద్ (లక్ష్మీ నాయక్ తండా) వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులంతా ఇరవై రెండేళ్ల యువకులని తెలుస్తోంది. ఏపూరుతండాకు చెందిన వినేశ్ కు తీవ్ర గాయాలు అవ్వగా అతడ్ని హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో ఆ తండాల్లో విషాదం అలముకుంది.
Also Read: మూడు గంటల్లో పెళ్లి, ఇంతలో వరుడు మృతి, పెళ్లికి తెచ్చిన దండలు చావుకు!