Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
Six Andhra MLCs:తమ రాజీనామాలు ఆమోదించాలని ఆరుకు ఎమ్మెల్సీలు ఏపీ శాసనమండలి ఛైర్మన్ ను కలిశారు. తాము స్వచ్చందంగా రాజీనామా చేశామని అంగీకరించాలన్నారు.

AP Legislative Council Chairman: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆరుగురు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో సమావేశం అయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను త్వరగా ఆమోదించాలని కోరారు. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జకియా ఖానం, పోతుల సునీతలు శాసనమండలి చైర్మన్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ ఆరుగురు మాజీ వైసీపీ ఎమ్మెల్సీలు వ్యక్తిగతంగా హాజరై, వివరణాత్మకంగా తమ వాదనలు వినిపించారు. చైర్మన్ మోషేన్ రాజు వారిని ఒక్కొక్కరిగా పిలిచి విడివిడిగా మాట్లాడారు. రాజీనామా లేఖలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
వైసీపీ 2024 ఎన్నికల్లో చెలరేగిన పరాజయం తర్వాత, పార్టీలో అసంతృప్తి మొదలైంది. ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు 2024-2025 మధ్య కాలంలోనే తమ రాజీనామాలు సమర్పించారు. పార్టీ నిర్వహణలో అసంతృప్తి, వ్యక్తిగత కారణాలు, TDP-BJP-JSP కూటమి వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో వారు రాజీనా ఇచ్చారు. చైర్మన్ మోషేన్ రాజు ఈ రాజీనామాలను ఆమోదించలేదు. తమ రాజీనామాలు ఆమోదించడం లేదని.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు వెల్లారు. నవంబర్ 26న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చైర్మన్ మోషేన్ రాజుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసి ఏడాది గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడం అక్రమం, ఏకపక్షపాతం, ప్రక్రియల దుర్వినియోగం గా హైకోర్టు భావించింది. మండలి చైర్మన్‌కు 4 వారాల్లోపు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఈ ఆదేశాలతో ఆరుగురు ఎమ్మెల్సీలు సోమవారం విజయవాడలోని మండలి కార్యాలయంలో చైర్మన్‌ను కలిశారు. వారు వ్యక్తిగతంగా హాజరై, రాజీనామాలు ఆమోదించాలన్నారు. చైర్మన్ మోషేన్ రాజు హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 వారాల్లోపు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికి కూటమి పార్టీల్లో చేరిపోయారు. పోతుల సునీత, జకియా ఖానం బీజేపీలో చేరారు. జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరారు. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి టీడీపీలో చేరారు.
వీరి రాజీనామాలు ఆమోదిస్తే.. ఆరు స్థానాలు ఖాళీ అవుతాయి. వాటికి ఉపఎన్నికలు వస్తే వైసీపీ ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు. సభలో బలం లేదనందున అన్ని సీట్లు మళ్లీ కూటమి గెలిచే అవకాశం ఉంది. అందుకే వైసీపీకి చెందిన శానసమండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించేదుకు ఆలస్యం చేస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకే మెజార్టీ ఉంది. అధికారం పోయిన తరవాత చాలా మంది పార్టీ మారిపోతున్నారు. వీరి రాజీనామాలు ఆమోదిస్తే .. ఆ ఖాళీలు మళ్లీ కూటమి ఖాతాలో పడిపోతాయి. అందుకే రాజీనామాలు ఆమోదం విషయంలో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆరుగురివి ఆమోదిస్తే.. మరికొంత మంది రాజీనామా చేస్తారని.. దీంతో మండలిలో వైసీపీ మెజార్టీ కోల్పోతుందన్న భావన తో ఆలస్యం చేస్తున్నారని భావిసత్తున్నారు. అయితే కోర్టు ఆదేశాలతో .. ఇప్పుడు రాజీనామాలపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.





















