Bangladesh fishermen Arrest: శ్రీకాకుళం తీరానికి బంగ్లాదేశ్ పడవ కలకలం, 13 మంది మత్స్యకారులు అరెస్ట్
బంగ్లాదేశ్‌కు చెందిన 13 మంది మత్స్యకారులు తమ బోటుతో సహా శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం పరిధిలోని మూసవానిపేట వద్ద ఉన్న సముద్ర తీరానికి కొట్టుకొచ్చారు.

Srikakulam Latest News | శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం, డి.మత్స్యలేశం సముద్ర తీరంలో ఒక అనుమానాస్పద పడవ కలకలం రేపింది. ఈ పడవను గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ పడవలో మొత్తం 13 మంది వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. మొదట వారు ఏం మాట్లాడుతున్నారో కూడా స్థానికులకు అర్థం కాలేదు.
పలుమార్లు వారిని ప్రశ్నించగా, వారంతా తాము బంగ్లాదేశ్‌కు చెందిన మత్స్యకారులమని వెల్లడించారు. సుమారు 20 రోజుల క్రితం తమ పడవ సముద్రంలో పాడైపోయిందని, తీవ్ర ఇబ్బందులకు గురైన తర్వాత ఈ రోజుకు ఇక్కడి తీరానికి చేరుకోగలిగామని ఆ బంగ్లాదేశీయులు తెలిపారు. స్థానిక మత్స్యకారులు వెంటనే ఈ సమాచారాన్ని మెరైన్ పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై, పడవలోని 13 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఈ విదేశీ మత్స్యకారులు ఆహారం లేక ఆకలితో ఉండటాన్ని గమనించిన స్థానికులు, వారికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం పంపిన పోలీసులు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అయితే అనుమతి లేకుండా విదేశాల నుంచి వచ్చిన పడవ కావడంతో బంగ్లాదేశ్ మత్స్యకారులపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని సీఐ ప్రసాదరావు తెలిపారు.
బంగ్లాదేశ్ మత్స్యకారుల వివరాలు...
1. సజీవ్, 21 సంవత్సరాలు.
2. జహంగీర్ 35 సంవత్సరాలు.
3. సబీర్ , 24 సంవత్సరాలు.
4. కోకాన్, 32 సంవత్సరాలు.
5. మక్సుధిన్, 40 సంవత్సరాలు.
6. మాలిక్, 80 సంవత్సరాలు.
7. మహ్మద్ ఫరూక్, 55 సంవత్సరాలు.
8. మక్షూద్, 50 సంవత్సరాలు.
9. నసీర్, 65 సంవత్సరాలు.
10. హెల్లాల్, 28 సంవత్సరాలు.
11. ఫరూక్, 50 సంవత్సరాలు.
12. ఆలం, 46 సంవత్సరాలు.
13. సమీమ్, 21 సంవత్సరాలు.
అందరూ, బంగ్లాదేశ్ లోని లాల్మోహన్ PS, భరిషాల్, కుల్సర్ గ్రామం, మంగల్ శిక్ధర్ బజార్ నివాసితులు అని పోలీసులు తెలిపారు. వారిని కళింగపట్నం, మెరైన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.






















