Amarjeet Sada: వయసు 8 ఏళ్లు, చేసింది మూడు హత్యలు - వెన్నులో వణుకు పుట్టించే క్రిమినల్ కథ
Amarjeet Sada: 8 ఏళ్లకే ఓ కుర్రాడు సీరియల్ కిల్లర్‌గా మారడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.
Amarjeet Sada Serial Killer:
8 ఏళ్లకే సీరియల్ కిల్లర్
8 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు..? మహా అయితే ఆడుకుంటాడు. లేదంటే బాగా అల్లరి చేస్తాడు. ఇష్టమైంది కొనివ్వకపోతే ఏడుస్తాడు. అంతకు మించి ప్రపంచం ఏమీ తెలియని వయసు అది. కానీ అదే 8 ఏళ్ల కుర్రాడు ప్రపంచంలోనే భయంకరమైన క్రిమినల్‌గా మారిపోతాడని ఎవరైనా ఊహిస్తారా..? సీరియల్ కిల్లర్‌గా మారి చిన్నారుల ప్రాణాలు తీస్తాడన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా..? మన ఊహకు అందకపోయినా, మనం నమ్మకపోయినా...ఇది నిజమే. అమర్‌జీత్ సదా. ఈ పేరు మన దేశ నేర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 8 ఏళ్ల కుర్రాడికి ఇంత దారుణమైన క్రిమినల్ హిస్టరీ ఉందంటే మనకు ముచ్చెమటలు పడతాయి. 2007లో ఓ శిశువుని దారుణంగా హత్య చేసింది ఈ పిల్లాడే. ప్రపంచంలోనే యంగెస్ట్ కిల్లర్‌గా రికార్డుకెక్కాడు. ఆ ఒక్క హత్యే కాదు. ఆ తరవాత వరసగా మూడు మర్డర్లు చేశాడు. అసలు ఆ వయసు పిల్లాడికి రక్తం చూస్తేనే భయం వేస్తుంది. కానీ అమర్‌జీత్ మాత్రం కరడుగట్టిన క్రిమినల్ కన్నా దారుణంగా ఆ హత్యలు చేశాడు.
శాడిస్ట్ అని తేల్చిన సైకాలజిస్ట్
బిహార్‌లోని ముసహహర్ గ్రామంలో 1998లో జన్మించాడు అమర్‌జీత్. 2006లో హత్యలు చేయడం మొదలు పెట్టాడు. ఆరేళ్ల తన తమ్ముడిని అత్యంత దారుణంగా చంపేశాడు. ఓ సైకాలజిస్ట్ అమర్‌జీత్‌తో చాలా సేపు మాట్లాడాడు. ఆ తరవాత ఓ సంచలన విషయం చెప్పాడు. "ఇతడో శాడిస్ట్. అవతలి వాళ్లను హింసిస్తాడు. ఆ హింసలోనే ఆనందం వెతుక్కుంటాడు" అని తేల్చి చెప్పాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి భగల్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించాడు. అక్కడే విచారణ మొదలు పెట్టారు. పోలీసులు ప్రశ్నించడం స్టార్ట్ చేయగానే ఆ సీరియల్ కిల్లర్ షాక్ ఇచ్చాడు. "నాకు ముందు బిస్కెట్‌లు ఇవ్వండి. ఆ తరవాతే ఏదైనా" అని నిర్భయంగా పోలీసులకు చెప్పాడు. ఆ తరవాత అమర్‌జీత్ ఇచ్చిన సమాధానాలు, అతడి ప్రవర్తన పోలీసులకే కంగారు పుట్టించింది. "వీడి వయసేంటి..? వీడు మాట్లాడుతున్న మాటలేంటి..?" అని అవాక్కయ్యారు.
పిన్ని కూతురి హత్య
ఓ కూలీ కుటుంబంలో పుట్టాడు అమర్‌జీత్. అప్పటికే డబ్బులు చాలీ చాలక ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు. ఆ తరవాత కూతురు పుట్టింది. ఇద్దరినీ పోషించే స్థోమత లేక ఆ కుటుంబం నానా అవస్థలు పడింది. ఇంట్లో పరిస్థితులను చూసి ముందు నుంచే మొండిగా తయారైపోయాడు అమర్‌జీత్. ఎప్పుడూ ఎవరితోనూ కలిసే వాడు కాదు. ఒంటరిగా ఆడుకునేవాడు. చెట్లు ఎక్కడం, దూకడం..ఊరంతా తిరగడం. ఇలాగే టైమ్‌పాస్ చేసేవాడు. ఆ తరవాతే అమర్‌జీత్ లైఫ్‌లో పెద్ద మలుపు వచ్చింది. ఆరేళ్ల కూతురితో పిన్ని అమర్ ఇంటికి వచ్చింది. అమర్ తల్లి, పిన్ని కూరగాయల కోసం బయటకు వెళ్లారు. ఏమనిపించిందో ఏమో వెంటనే ఆ ఆరేళ్ల చెల్లెల్ని గట్టిగా కొట్టాడు. గిచ్చాడు. ఆ చిన్నారి ఏడుస్తుంటే మెడ మీద రెండు చేతులూ వేసి గట్టిగా నొక్కాడు. ఊపిరాడకుండా చేసి చంపేశాడు. దగ్గర్లోనే ఓ అడవిలోకి వెళ్లి ఆ చిన్నారి ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టలేనంతగా నుజ్జు నుజ్జు చేశాడు. ఆ తరవాత అక్కడే డెడ్‌బాడీని పాతి పెట్టి వచ్చాడు. ఇంత జరిగినా అమర్‌జీత్ తల్లిదండ్రులు తమ కొడుకుని వెనకేసుకొచ్చారు. ఆ తరవాత సొంత చెల్లిని కూడా చంపిన తరవాత కానీ వాళ్లకు అర్థం కాలేదు. ఎందుకు చంపాన్ అని అడిగితే "ఊరికే అలా చేయాలనింపించింది" అని సమాధానమిచ్చాడని తల్లిదండ్రులు పోలీసుల విచారణలో చెప్పడం సంచలనం కలిగించింది.
ఎక్కడికెళ్లిపోయాడు..?
2007లో ఖుష్బూ అనే ఓ 6 నెలల చిన్నారిని హత్య చేశాక పోలీసులు అమర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చారని కానీ, తనను జైలుకి తీసుకెళ్తున్నారని కానీ ఏ భయమూ కనిపించలేదు. పైగా నవ్వుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ప్రస్తుతానికి జువైనల్ హోమ్‌కు తరలించారు. 2016లో అమర్‌జీత్‌కి 18 ఏళ్లు వచ్చాయి. అప్పుడు పోలీసులు జైలు నుంచి విడుదల చేశారు. అప్పటి నుంచి మళ్లీ అమర్‌కి సంబంధించి ఎలాంటి సమాచారమూ లేదు. ఎక్కడ ఉన్నాడు..? ఏం చేస్తున్నాడు..? ఇప్పటికీ తేలలేదు.
Also Read: Amritpal Singh Arrested: 37 రోజులు పది సిటీలు, అమృత్ పాల్ కోసం సినిమా లెవెల్‌లో ఛేజింగ్