Adilabad Crime: ఆదిలాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత, జిల్లా చరిత్రలోనే అత్యధికమని ఎస్పీ వెల్లడి
Adilabad News | ఏవోబి నుంచి ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు 2.25 కోట్ల భారీ గంజాయి సీజ్ చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana News | తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారంతో ఓ కంటైనర్ లో మహారాష్ట్ర కు భారీగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఆదిలాబాద్ ఎస్పి గౌస్ ఆలం తలమడుగు పోలీస్ స్టేషన్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న లక్ష్మిపూర్ చెక్ పోస్ట్ వద్ద ఓ కంటైనర్ లో భారీగా గంజాయిని తరలిస్తున్నారని సమాచారం అందింది. దాంతో మహారాష్ట్రలోని బుల్టానాకు తరలిస్తుండగా భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. UK 08CB 5318 నం.గల కంటైనర్ లో 292 ప్యాకెట్లలో దాదాపుగా 900 కేజీల గంజాయి, సుమారుగా 2.25 కోట్ల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఈ గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులూ మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కంటెయినర్ డ్రైవర్ వసీం అన్సారీ, క్లీనర్ ఆర్మాన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశామని, వీరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిగతా ఆరుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడడం ఇదే తొలిసారి అని, చాకచక్కంగా ఇంత పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్న తన సిబ్బందిని అభినందించారు.
Also Read: Hyderabad Crime: హోటల్‌లో ఇద్దరు మహిళలు ఆకస్మిక తనిఖీలు, డౌట్ వచ్చి పోలీసులకు ఫోన్ చేయగా మారిన సీన్
జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ ఇతర మాదకద్రవ్వాల నిర్మూలనకు పోలీస్ శాఖ తరపున అవగాహన సదస్సు సైతం నిర్వహిస్తూ యువతకు చెడు వ్యాసనాలకు గురవకొండ అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తామన్నారు. ఎవరైనా గంజాయి డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్వాలను రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, డీసీఆర్బి డిఎస్పి సురేందర్ రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ సిఐ పణిధర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, జైనథ్ సిఐ సాయినాథ్, ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ ఎస్సైలు అంజమ్మ, ముజాహిద్, విష్ణువర్ధన్, సిసిఎస్ రూరల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.