Hyderabad Crime: హోటల్‌లో ఇద్దరు మహిళలు ఆకస్మిక తనిఖీలు, డౌట్ వచ్చి పోలీసులకు ఫోన్ చేయగా మారిన సీన్
Hyderabad News | ఇద్దరు మహిళలు తాము అధికారులమని చెప్పి హోటల్ లో తనిఖీలకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.
Pet Basheerabad Police | హైదరాబాద్: నగరంలో కొన్ని నెలల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులను తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. క్వాలిటీ పెంచాలని, లేకపోతే జైలుకు వెళ్లడం తప్పదని సైతం వార్నింగ్ ఇస్తూనే, నిత్యం ఏదోచోట తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యుల మంటూ ఇద్దరు మహిళలు హోటల్ నిర్వాహకులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. హోటల్ సిబ్బంది ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర సెంటర్ లో ఉన్న గిస్మత్ జైల్ మండి హోటల్‌కు ఇద్దరు మహిళలు వెళ్లారు. తాము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెంబర్స్ అని పరిచయం చేసుకుంటూ వారి వద్ద ఉన్న ఐడీ కార్డులు చూపించారు. మీ కిచెన్ తో పాటు మీరు వాడే వంట పదార్థాలు తనిఖీలు చేయాలంటూ వంటగదిలోకి వెళ్లి అంతా వీడియోలు తీసుకున్నారు. అనంతరం ఆ ఇద్దరు మహిళలు ఆఫీస్ రూముకు వచ్చి మీ హోటల్ నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని చెప్పారు. హోటల్ కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నాణ్యమైన వంట పదార్థాలు వాడటం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తమ హెడ్ ఆఫీస్ కు రిపోర్ట్ చేస్తామంటూ హోటల్ సిబ్బందిని మహిళలు బెదిరించారు. హోటల్‌కు సంబంధించిన రిపోర్ట్ గోప్యంగా ఉంచాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని నిర్వాహకులను డిమాండ్ చేశారు.
కాగా, వారి మాటతీరు, వ్యవహారంతో అనుమానం రావడంతో హోటల్ నిర్వాహకులు అదే సమయంలో సీక్రెట్‌గా పేట్ బషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్‌కు చేరుకున్న పోలీసులు ఆఫీసర్లం అని బెదిరింపులకు పాల్పడి, డబ్బులు డిమాండ్ చేసిన ఆ ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తనిఖీలు చేసిన దృశ్యాలు సి.సి కెమెరాలో నమోదయ్యాయి. సి.సి ఫుటేజ్ ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్