KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
KTR About Devara Ticket Price: రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో కనీసం దేవర ఫంక్షన్ కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఎన్టీఆర్(Jr NTR) సినిమాని అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం దేవర(DEVARA) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం కూడా చేతకాలేదని ఎద్దేవా చేశారు. తమ హయాంలో హైదరాబాద్ నగరంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేవాళ్లమని అన్నారు కేటీఆర్.
హైదరాబాద్‌లో ఎన్నో చేశామన్న కేటీఆర్
హైదరాబాద్ మహానగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో తమ ప్రభుత్వ హయాంలో కృషి చేశామన్నారు కేటీఆర్. హైదరాబాద్ లో ఏ చిన్న పండగ వచ్చినా మంత్రులు, అధికారులు కూర్చుని నిర్వహణ విషయంలో నిర్ణయాలు తీసుకునేవారన్నారు. ఎక్కడా ఎవరికీ చిన్నపాటి ఇబ్బంది కూడా తలెత్తకుండా చూసేవారమన్నారు. ఫార్ములా రేస్, గణేష్ నిమజ్జనం, మొహర్రం ఊరేగింపు, బోనాల పండగ అయినా.. ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా చేసిన ఘతన తమ ప్రభుత్వానిదని అన్నారు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్లప్పుడు కూడా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకునేదని, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండేదని అన్నారు.
"నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, ఆయన పాపం ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే, దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, అలాంటి పరిస్థితుల్లోకి ఈరోజు ఈ నగరం వెళ్లిపోయింది." అని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగిపోయాయన్నారు. గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంది, ఇప్పుడెలా ఉంది అనే విషయం ప్రజలకే బాగా అవగాహన ఉందన్నారు కేటీఆర్.
LIVE: BRS Working President @KTRBRS and MLAs addressing the Press at Kukatpally MLA Camp Office https://t.co/OPrrFn973a
— BRS Party (@BRSparty) September 25, 2024
మరోవైపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై.. సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా ఊపందుకుంది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్న ఆదివారం నాడు మాదాపూర్ లోని ఓ హోటల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, దేవర ఈవెంట్ కు కేటాయించిన పోలీసులు కూడా సీఎం బందోబస్తుకోసం వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు లేక దేవర ప్రీ రిలీజ్ జరిగే హోటల్ వద్ద క్రౌడ్ మేనేజ్ మెంట్ సాధ్యం కాలేదంటున్నారు. పోలీసులు వచ్చేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదే వెలితి..
ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర ఈనెల 27న పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఐదు భాషల్లో ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇతర ప్రాంతాల్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరైన ఎన్టీఆర్ చివరిగా హైదరాబాద్ లో గ్రాండ్ ఫంక్షన్ లో అభిమానులతో మాట్లాడాలనుకున్నారు. కానీ సరిగ్గా హైదరాబాద్ ఈవెంట్ దగ్గరే రచ్చ జరిగింది. ఆ ఫంక్షన్ అనుకోకుండా రద్దయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా తన బాధను వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఫ్యాన్స్ కంటే తానే ఎక్కువ బాధపడ్డానన్నారు. అయితే దేవర మూవీని ఇప్పుడిలా రాజకీయ నాయకులు కూడా తమ విమర్శలకోసం వాడుకోవడం విశేషం. రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో కనీసం దేవర ఫంక్షన్ కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read: ‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ