Adilabad Crime News: ఎన్నారైని అంటే నమ్మేశారు - పాపం నిండా మునిగారు - పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు
SK Micro Finance fraud: ఆదిలాబాద్ జిల్లాలో ఎస్.కె మైక్రో ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. 300 మందిని మోసంచేశాడు.

Adilabad SK Micro Finance fraud: ఆదిలాబాద్ జిల్లాలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తానంటు ఎస్కే గ్రూప్ కృష్ణ, NRI అంటూ, సామాజిక సేవ పేరుతో ప్రముఖులతో పరిచయాలు చేసుకొని వందల మందిని బురిడీ కొట్టించి పరారయ్యాడు. బాదితుల పిర్యాదుతో రంగంలోకి దిగిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఎట్టకేలకు చాకచక్యంగా కృష్ణ ను పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
ఎన్నారైనంటూ బిల్డప్
డిజిటల్ మైక్రో ఫైనాన్స్ , ఆసుపత్రుల్లో, అంగన్వాడీల వద్ద ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వందల మందిని మోసం చేసిన ప్రధాన నిందితుడు జవాదే కృష్ణ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని పోలీసులుతెలిపారు. ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గూడ గ్రామానికి చెందిన కృష్ణ, ఆర్.ఎంపీ గా ప్రాక్టీస్ చేస్తూ గత కొన్నేళ్ల క్రితం జిల్లా నుండి ఇతర రాష్ట్రాల్లో తిరిగేవాడు. అలా ఇతను మహారాష్ట్రలోని పూనా, బారామతి లో సోనాయి కాంప్లెక్స్ వద్ద ఉండేవాడు. అక్కడ కూడా కోవిడ్ సమయంలో ఇతను మోసాలకు పాల్పడ్డాడు. అనంతరం గత ఏడాది జిల్లాలో విదేశాల్లో ఉండి వచ్చానని.. NRIని అంటూ సామాజిక సేవలు చేస్తున్నానని, పరిచయమై డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టాడు. డబ్బులు వసూలు చేసి, జల్సాలకు తిరుగుతూ ఖర్చు చేసి, సామాజిక సేవ పేరుతో ప్రముఖుల పరిచయాలతో ప్రచారం చేసుకుని, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 300 మందిని మోసం చేశాడు. నిందితునిపై ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 16 కేసులు నమోదయ్యాయి.
మైక్రో ఫైనాన్స్ పేరుతో మొదట మోసాలు
నిందితుడు కృష్ణ 2024 సంవత్సరం డిసెంబర్ లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, ఉట్నూర్ లో ఎన్నారై అంటూ ఎస్కే మైక్రో ఫైనాన్స్ పేరుతో కార్యాలయాలను ప్రముఖులతో ప్రారంభించి తన నేర పద్ధతిని ప్రారంభించాడు. మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని జిల్లా వ్యాప్తంగా రెండు కార్యాలయాలలో దాదాపు 300 మంది వద్ద 20 వేల రూపాయల మెంబర్షిప్ పేరుతో వసూలు చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రుల నందు స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం మరియు అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమంది వద్ద డబ్బులను తీసుకోవడం చేసి మోసం చేశాడు. మొదటగా ఈ రెండు కార్యాలయాల్లో ఐదుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం వారి ద్వారా నగదు రూపంలో ఒక్కొక్కరి వద్ద 20 వేల రూపాయలను తీసుకొని దాదాపు జిల్లా వ్యాప్తంగా 54 లక్షలు అదే విధంగా ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాల పేరుతో 15 లక్షలు వసూలు చేసి మొత్తం 69 లక్షల ఇప్పటివరకు వసూలు చేశాడు. డిసెంబర్ నుండి ఆరు నెలల పాటు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు తరచూ అడుగుతూ ఉండడంతో జులై నెల మొదటి వారంలో తన సొంత గ్రామం శంకర్ గుడాలో తొమ్మిది లక్షల నగదు మూడు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు దాచి, 15 లక్షల నగదుతో పారిపోయాడు.
అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఇతని వద్ద నుండి దాదాపు తొమ్మిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు 5.5 తులాల ఉంగరాలు, 1.2 తులాల బంగారు కాయిన్స్, 4 తులాల బంగారు చైన్ (3 చైన్లు), మొత్తం 10.7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల దగ్గర దోచుకున్న డబ్బులతో బంగారు ఆభరణాలు, కారు కొన్నట్లు తెలిపారు. ప్రజల వద్ద నుండి విడతలవారీగా మోసం చేసి తీసుకున్న డబ్బులలో ఆరు లక్షలు ఆదిలాబాద్ లో ఒక ప్రైవేటు హోటల్ యజమానికి, ఆరు లక్షలు నాగపూర్ నందు గల భవన యజమానికి, 3.5 లక్షలు ఆదిలాబాద్ ఉట్నూర్ కార్యాలయాలకు, 2.1 లక్షలు తమ్ముని అవసరాల నిమిత్తం ఇచ్చి, మిగిలినవి జల్సాలకు తప్పించుకోవడానికి ఖర్చు చేశాడు.





















