Kolkata: నేను అత్యాచారం చేయలేదు, హత్య మాత్రమే చేశా - లై డిటెక్టర్ టెస్ట్‌లో కోల్‌కతా కేసు నిందితుడు
Kolkata Case: కోల్‌కతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్‌కి లై డిటెక్టర్ టెస్ట్ చేశాక కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తాను అత్యాచారం చేయలేదని, కేవలం హత్య చేశానని చెబుతున్నాడు.
Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార ఘటన జరిగి నెల రోజులైపోయింది. ఇప్పటి వరకూ ఒకే ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇంకెవరైనా నిందితుడికి సహకరించారా..? ఇంకెవరి హస్తమైనా ఉందా అన్న కోణాల్లో విచారణ కొనసాగుతూనే ఉంది. సామూహిక అత్యాచారం జరగలేదన్నది మాత్రం తేలింది. అయితే...నిందితుడికి ఎవరైనా సహకరించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెమినార్ రూమ్‌లో అత్యాచారం జరిగినప్పుడు అటు వైపు ఎవరూ రాకుండా ఎలా ఉన్నారన్నదే పెద్ద ప్రశ్న. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు సీబీఐ అధికారులు నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ చేశారు.
ఇందుకోసం కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తెచ్చుకున్నారు. ఆగస్టు 25వ తేదీన సంజయ్ రాయ్‌కి పాలిగ్రఫీ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్‌తో చిక్కుముడులు అన్నీ విడిపోతాయనుకుంటే...కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ABPకి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ట్రైనీ డాక్టర్‌ని హత్య చేసినట్టు సంజయ్ రాయ్ అంగీకరించినా... అత్యాచారం చేయలేదని తేల్చి చెప్పాడు. లై డిటెక్టర్ టెస్ట్‌లో ఇదే విషయం స్పష్టం చేశాడు. నోరు నొక్కి చంపేశానని, కానీ అత్యాచారం మాత్రం చేయలేదని సమాధానం చెప్పాడు. ఇదే ఇప్పుడు అధికారులకు మిలయన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
ఈ టెస్ట్ చేసిన సమయంలో ముందుగా మామూలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఆ తరవాత ఈ ఘటనకు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్టు ABP News సోర్సెస్ ద్వారా తెలిసింది. "నీ పేరేంటి..? నువ్వెక్కడుంటావ్, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి..? ఇలాంటి ప్రశ్నలు అడిగి, నిందితుడు సరైన సమాధానాలు చెబుతున్నాడా లేదా అని పరిశీలించారు. ఆ తరవాత అసలు విచారణ మొదలైంది.
ప్రశ్న: నువ్వు ఎవరిపైనా అయినా అత్యాచారం చేశావా..?
సమాధానం: లేదు
ప్రశ్న: నువ్వు సెమినార్ హాల్‌లోకి వెళ్లావా..?
సమాధానం: అవును వెళ్లాను
ప్రశ్న: సెమినార్ హాల్‌లోకి ఎందుకు వెళ్లావ్?
సమాధానం: ఓ చిన్న పని మీద వెళ్లాను
ప్రశ్న: నువ్వు వెళ్లిన సమయంలో అక్కడ ఇంకెవరైనా ఉన్నారా?
సమాధానం: లేరు. ఆ మూడో అంతస్థులో ఎవరూ కనిపించలేదు.
ప్రశ్న: ఆమె నోరు నొక్కి చంపావా?
సమాధానం: అవును
ప్రశ్న: ఆ సమయంలో నీతో ఎవరైనా ఉన్నారా?
సమాధానం: ఎవరూ లేరు
ప్రశ్న: నిజం చెప్పు, నువ్వు ఆమెని అత్యాచారం చేశావా?
సమాధానం: లేదు
ఈ సమాధానాలు విన్నాక సీబీఐ అధికారులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. విచారణను ఇది మరింత కాంప్లికేటెడ్‌గా మార్చేసింది. హత్య చేసినట్టు ఒప్పుకుంటున్నా, అత్యాచారం చేయలేదని తేల్చిచెబుతున్నాడు సంజయ్ రాయ్. ఇప్పటి వరకూ మొత్తం ఏడుగురికి లై డిటెక్టర్ టెస్ట్‌లు చేశారు. కానీ సంజయ్ రాయ్ తప్ప మరెవరూ అరెస్ట్ కాలేదు. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన అవినీతి కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు అతని బాడీగార్డ్, ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. 8 రోజుల కస్టడీకి తరలించారు.
Also Read: North Korea: 30 మంది అధికారులను ఉరి తీసిన కిమ్, సరిగ్గా పని చేయలేదని ఈ శిక్ష