Karnataka News: బస్సు కిటికీలోంచి తల బయటకు పెట్టడం ఎంత ప్రమాదమో తెలుసా? - తెగిపడిన మహిళ తల, కర్ణాటకలో షాకింగ్ ఘటన
Karnataka News: కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు కిటికీలో నుంచి తల బయటకు పెట్టిన మహిళను టిప్పర్ ఢీకొని తల, చేయి తెగిపడ్డాయి. ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Woman Died Due To Stuck Her Head Out Of The Bus Window In Karnataka: బస్సులు, వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కిటికీ లోంచి తల, చేతులు బయటకు పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అది ఎంత ప్రమాదమో తెలిపే ఉదాహరణ కర్ణాటకలో (Karnataka) చోటు చేసుకుంది. ఓ మహిళ బస్సు కిటికీలో నుంచి తల బయటకు పెట్టగా అటుగా వస్తోన్న టిప్పర్ ఢీకొని ఆమె తల తెగి రోడ్డుపై పడిపోయింది. ఈ దారుణ కర్ణాటకలోని మైసూర్ జిల్లా నంజనగూడు తాలూకా సింధువళ్లి గ్రామం వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బేగూరు సమీపంలోని ఆలహల్లి గ్రామ నివాసి శివలింగమ్మ (58) అనే మహిళ కర్ణాటక ఆర్టీసీ బస్సులో శనివారం కుడివైపు కూర్చుని ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో వాంతి చేసుకునేందుకు తల కిటికీ బయట పెట్టగా.. అదే సమయంలో టిప్పర్ లారీ బస్సును రాసుకుంటూ దూసుకుపోయింది.
మహిళ తల, చేయి కట్
ఈ ప్రమాదంలో శివలింగమ్మ తలతో పాటు కుడి చేయి తెగి రోడ్డుపై పడిపోయాయి. మృతురాలు మైసూరు నుంచి గుండ్లుపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు లారీని ఓవర్ టేక్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ప్రయాణికురాలి కుడి చేతికి కూడా ఫ్రాక్చర్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ప్రయాణికురాలిని చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆర్టీసీ బస్సును సీజ్ చేసి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





















