Crime News: అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
Andhrapradesh News: తన భార్యను కాపురానికి పంపలేదని ఓ వ్యక్తి అత్తను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో జరిగింది.

Man Murdered His Mother In Law In Annamayya District: అన్నమయ్య జిల్లాలో (Annamayya District) దారుణం జరిగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదని ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు నియోజకవర్గం కె.వి.పల్లి మండలంలోని నారమాకులపల్లికి చెందిన ఆరేటి నీలావతి అనే మహిళను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో కొట్టి చంపేశాడు. ఎన్నికల సమయంలో నీలావతి పెద్ద కుమార్తెకు, అల్లుడికి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె కూతుర్ని తీసుకొచ్చి ఇంటి వద్దే ఉంచుకుంది. శుక్రవారం అల్లుడు విజయ్ చిత్తూరు నుంచి నారమాకులపల్లికి వచ్చి అత్తతో గొడవపడ్డాడు. తన భార్యను కాపురానికి పంపాలని నిలదీశాడు.
దీనికి అత్త నిరాకరించగా.. శనివారం ఉదయం పొడవాటి కర్రతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.






















