Nellore News: నెల్లూరులో బడి భవనం సన్‌సైడ్ కూలి విద్యార్థి దుర్మరణం, 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Lokesh: నెల్లూరునగరంలో పాఠశాల ఆవరణలోని నిర్మాణంలో ఉన్న భవనం సన్‌సైడ్ శ్లాబ్ కూలి ఓ విద్యార్థి మృతి చెందాడు. మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. విద్యార్థి కుటుంబానికి ఐదులక్షల పరిహారం ప్రకటించారు.
![Nellore News: నెల్లూరులో బడి భవనం సన్‌సైడ్ కూలి విద్యార్థి దుర్మరణం, 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం Student Dies in Nellore School 5 lakh Compensation Announced by the Government Nellore News: నెల్లూరులో బడి భవనం సన్‌సైడ్ కూలి విద్యార్థి దుర్మరణం, 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/0d7908aaa6d2f63ff787cf46920eb54f17220524709261048_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలలో నాసిరకం పనులు ఓ విద్యార్థి నిండు ప్రాణాలను బలితీసుకుంది. నెల్లూరు(Nellore) నగరంలోని మున్సిపల్ పాఠశాలలో సన్‌సైడ్ కూలి మీదపడటంతో 9వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించగా....విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) విచారం వ్యక్తం చేశారు.
నాసిరకం నాడు-నేడు పనులకు విద్యార్థి బలి
నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాసిరకం పనులు ఉజ్వల భవిష్యత్ ఉన్న ఓ విద్యార్థి(Student) ప్రాణాలు బలి తీసుకున్నాయి. నెల్లూరు(Nellore)లోని బీవీనగర్ కె.ఎన్.ఆర్. మున్సిపల్ పాఠశాలలో నాడు-నేడు పథకం కింద నూతనంగా నిర్మిస్తున్న భవనం సన్‌సైడ్ శ్లాబ్ కూలి 9వ తరగతి విద్యార్థి గురు మహేంద్ర కన్నుమూశాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఆడుకునేందుకు భవనం వద్దకు వెళ్లిన విద్యార్థిపై శ్లాబ్ కూలిపడింది.
ఉపాధికోసం వస్తే ఊపిరిపోయింది
వెంకటగిరికి చెందిన గురవయ్య దంపతులు కూలిపనుల కోసం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఓఅపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించుకుంటున్నారు.కె.ఎన్.ఆర్(K.N.R) పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గురుమహేంద్ర రోజూలాగే పాఠశాలకు వెళ్లాడు. క్లాసులు పూర్తయిన తర్వాత పాఠశాల ఆవరణలోనే తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్లగా..ఉన్నపళంగా సన్‌సైడ్ శ్లాబ్ కూలి విద్యార్థిపై పడింది. మహేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థి సంఘాలు(Student Unions) అక్కడికి చేరుకుని ధర్నా చేపట్టాయి. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తున్న అంబులెన్స్‌ను విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థి మృతిపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టడంతో ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి.
Also Read: స్పాలో వ్యక్తి దారుణ హత్య, హంతకులను పట్టించిన పచ్చబొట్టు
మంత్రుల సంతాపం
నెల్లూరు పాఠశాలలో విద్యార్థి మృతిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు. పురపాలక మంత్రి నారాయణ(Narayana) సైతం విద్యార్థి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
నాసిరకం పనులే కారణమా...?
వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింద భవన నిర్మాణ పనులు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ నిర్మాణాలు అత్యంత నాసిరకంగా నిర్మిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందులో భాగంగానే నెల్లూరు నగరంలో నిర్మాణంలో ఉండగానే శ్లాబ్ కూలిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు విద్యార్థులు తరగతి గదిలో ఉండగా కూలితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తక్షణం నాడు-నేడు పథకం కింద నిర్మిస్తున్న పనులను సమీక్షించాలని కోరుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో పాఠశాల భవనం నిర్మిస్తున్న గుత్తేదారుడిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థి చిన్నవయసులోనే మృతి చెందడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: పీజీ హాస్టల్‌లో యువతి హత్య, ప్రాధేయపడినా వదలని కిరాతకుడు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)