Mumbai News: స్పాలో వ్యక్తి దారుణ హత్య, హంతకులను పట్టించిన పచ్చబొట్టు
Spa Murder Case: స్పాలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ వ్యక్తి శరీరంపై ఉన్న పచ్చబొట్టు హంతకులను గంటల వ్యవధిలోనే పట్టించింది. వాఘ్మారే ఆర్టీఐ కార్యకర్త అని చెప్పుకునే వాడని తెలుస్తోంది.
Mumbai Spa Murder Case: సూర్య, అసిన్ నటించిన 'గజిని' సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఇందులో హీరో సంజయ్ రామస్వామి తన ప్రేయసి కల్పనను చంపిన హంతకులను ఒక్కొక్కరిగా చంపేస్తాడు. ప్రతి 10 నిమిషాలకు హీరో తన జ్ఞాపకశక్తిని కోల్పోవడం సినిమాలో ఆసక్తికరమైన అంశం. అటువంటి పరిస్థితిలో తన శత్రువులను మరచిపోకుండా, హీరో తన శత్రువుల పేర్లను తన శరీరంపై టాటూగా వేయించుకుంటాడు. ఇప్పుడు ముంబైలో కూడా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో బుధవారం సాఫ్ట్ టచ్ స్పాలో తన శత్రువుల పేర్లను తన శరీరంపై టాటూగా వేయించుకున్న వ్యక్తిని హత్య చేశారు. స్పాలో హత్యకు గురైన వ్యక్తి శరీరంపై శత్రువుల పేర్లను టాటూలుగా వేయించుకున్నాడని ముంబై పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం సమయంలో గురు వాఘ్మరే తన తొడలపై తన శత్రువుల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడని.. అతడికి మొత్తం 22మంది శత్రువులున్నట్లు పోలీసులు, వైద్యులు కనుగొన్నారు.
ఐదుగురు నిందితుల అరెస్ట్
ఈ వ్యక్తి పేరు గురు వాఘ్మారే . అతనో పేరు మోసిన రౌడీ షీటర్. గురు వాఘ్మారే హత్య కేసులో ఇప్పుడు ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం.. హత్యకు చాలా కాలం ముందు వ్యక్తి తన శరీరంపై 22 మంది శత్రువుల పేర్లను టాటూలుగా వేయించుకున్నాడు. ఈ వ్యక్తుల సహాయంతో.. ఈ హత్యలో పాల్గొన్నఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా పలు కీలక, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు గురు వాఘ్మారేపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బుధవారం తెల్లవారుజామున సెంట్రల్ ముంబైలోని వర్లీలోని సాఫ్ట్ టచ్ స్పాలో గురు వాఘ్మారే హత్యకు గురయ్యాడు. శవపరీక్ష సమయంలో అతడి తొడలపై తన శత్రువుల పేర్లను రాసుకున్నట్లు తేలిందని ఓ అధికారి తెలిపారు.
ఆర్టీఐ కార్యకర్త అని చెప్పుకుంటూ..
గురు వాఘ్మారే తాను ఆర్టీఐ కార్యకర్త అని చెప్పుకుని తిరిగేవాడని తెలుస్తోంది. గురు వాఘ్మరే హత్య కేసులో స్పా యజమాని షెరేకర్ కూడా ఉన్నారు. గురు వాఘ్మారే దోపిడీ బెదిరింపులతో విసిగి అతడిని చంపడానికి పథకం పన్నినట్లు తెలుస్తుంది. గురు వాఘ్మారేను హత్య చేసేందుకు మహ్మద్ ఫిరోజ్ అన్సారీ కి రూ. ఆరు లక్షలు ‘సుపారీ’ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మూడు నెలల క్రితం కుట్ర
మహ్మద్ ఫిరోజ్ అన్సారీ, షెరేకర్‌తోపాటు మరొకరు కలిసి ముంబై సమీపంలోని నలసోపరా వద్ద స్పాను నడుపుతున్నారు. గతేడాది అందులో జరిగిన దాడుల కారణంగా స్పా మూతపడింది. వాఘ్మారే అధికారులకు ఫిర్యాదు చేయడం వల్లనే ఈ దాడి జరిగినట్లు అధికారి తెలిపారు. వాఘ్మారే తరచూ స్పాలపై ఇటువంటి ఫిర్యాదులు చేయడం, స్పా యజమానుల నుంచి బలవంతంగా డబ్బు వసూళ్లకు పాల్పడడం పరిపాటి. అతడి అకృత్యాలతో విసిగిన స్పా యజమాని షెరేకర్.. అన్సారీని సంప్రదించాడు. వాఘ్మారేను హత్య చేయమని షేరేకర్ తనను కోరినట్లు పోలీసుల ఎదుట తెలిపాడు. మూడు నెలల కిందటే వాఘ్మారే హత్యకు ప్లాన్ జరిగింది. అతడి దినచర్యను పూర్తిగా తెలుసుకున్న తరువాత, నిందితులు అతనిని షెరెకర్ స్పాలో హత్య చేయాలని ప్లాన్ చేశారు.
ప్రియురాలితో పుట్టిన రోజు జరుపుకుంటుండగా..
సియోన్‌లోని ఓ బార్ వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలో వాఘ్మారే కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ మంగళవారం సాయంత్రం తన ప్రియురాలితో కలిసి పుట్టినరోజు జరుపుకున్నాడు. సీసీటీవీలో ఇద్దరు దాడి చేసిన వ్యక్తులు రెయిన్‌కోట్‌లు ధరించి గురు వాఘ్‌మారేను వెంబడించడం కనిపించింది. ఆ రాత్రి తర్వాత, వారిద్దరూ వాఘ్మారేను స్కూటర్‌పై షేరేకర్ స్పా వద్దకు అనుసరించడం సీసీటీవీలో రికార్డ్ అయింది. దాడికి పాల్పడిన వారిలో ఒకరు బార్ సమీపంలోని పాన్ షాప్ నుండి రెండు గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేశారని, దీనికి యూపీఐ సిస్టమ్ ద్వారా చెల్లింపు జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. యూపీఐ రికార్డుల్లో అతని పేరు మహమ్మద్ ఫిరోజ్ అన్సారీ అని కూడా తేలింది. అన్సారీ UPI IDకి లింక్ చేయబడిన ఫోన్ నంబర్ నుండి షెరేకర్‌కు అనేక కాల్స్ వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. హత్య చేయాలనే ఉద్దేశంతో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఫిరోజ్, సాకిబ్ అన్సారీ స్పాలోకి ప్రవేశించారు. దీని తరువాత, వారు వాఘ్మారే ప్రియురాలిని మరొక గదిలోకి తీసుకువెళ్లారు. ఆపై వారు రూ. 7,000 విలువైన వివిధ కత్తెరలతో వాఘ్మారేను హత్య చేశారు. ఈ క్రమంలో ఒకరు బ్లేడ్‌తో గొంతు కోయగా, మరొకరు పొట్టలో కత్తితో పొడిచారు.
హత్య జరుగుతుందని ప్రియురాలికి తెలుసు
ఉదయం 9.30 గంటలకే హత్య విషయం తనకు తెలిసిందని, ఆ విషయాన్ని షేరేకర్‌కు తెలియజేశానని వాఘ్‌మారే స్నేహితురాలు చెప్పిందని అధికారి తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. పోలీసులు ఇప్పటికే షెరేకర్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని రోజంతా విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు. ఫిరోజ్ అన్సారీని నలసోపారా నుండి క్రైమ్ బ్రాంచ్ బృందం అరెస్టు చేసింది. రాజస్థాన్‌లోని కోటా నుండి న్యూఢిల్లీకి తీసుకువెళుతుండగా హత్య కుట్రలో ప్రమేయం ఉందనే అనుమానంతో సాకిబ్ అన్సారీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. వాఘ్మారే హత్యతో తన ప్రియురాలి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నారు. వాగ్మారే 2010 నుండి ముంబై, నవీ ముంబై, థానే , పాల్ఘర్‌లోని స్పా యజమానుల నుండి డబ్బు వసూలు చేస్తున్నాడని .. అతనిపై దోపిడీ, అత్యాచారం,వేధింపులకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.