Viral News: హడల్ పుట్టిస్తున్న శారీ కిల్లర్, 13 నెలల్లో 9 మంది మహిళల హత్య - చీరతో ఉరి బిగించి
Crime News: యూపీలో 13 నెలల వ్యవధిలో 9 మంది మహిళలు హత్యకు గురయ్యారు. అందరినీ చీరతో ఉరి బిగించి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Viral News in Telugu: యూపీలో ఓ సీరియల్ కిల్లర్ హడలు పుట్టిస్తున్నాడు. 13 నెలల్లో 9 మంది మహిళల్ని దారుణంగా హత్య చేశాడు. వాళ్ల మృతదేహాల్ని పంట పొలాల్లో పాతి పెట్టాడు. ఈ అన్ని హత్యల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. అదే చీర. ఈ మహిళలందరినీ వాళ్ల చీరతోనే ఉరి బిగించి చంపాడు ఈ కిల్లర్. పైగా మృతులంతా ఒకటే వయసు వాళ్లు. 8 మంది మహిళలు 40-65 ఏళ్ల లోపు వాళ్లేనని పోలీసులు వెల్లడించారు. షాహీ, షీష్‌గర్, షేర్‌గర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఈ హత్యలు జరిగాయి. వీళ్లందరి మృతదేహాలూ చెరకు తోటల్లో కనిపించాయి. అయితే.. వీరెవరి పైనా లైంగిక దాడి జరగలేదని పోలీసులు ధ్రువీకరించారు. వాళ్లు కట్టుకున్న చీరలతోనే వాళ్లకు ఉరి వేసి చంపినట్టు తేలింది. ప్రస్తుతం పోలీసులు ఈ శారీ కిల్లర్ కోసం గాలిస్తున్నారు.
గతేడాది జూన్‌లోనే మూడు హత్యలు జరిగాయి. ఆ తరవాత వరుస పెట్టి మర్డర్లు చేశాడు క్రిమినల్. ఈ వరుస హత్యలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. 300 మంది పోలీసులు కేవలం ఈ కేసు కోసమే పని చేస్తున్నారు. వీళ్లంతా టీమ్‌లుగా విడిపోయి విచారణ కొనసాగిస్తున్నారు. పలు చోట్ల నిఘా పెట్టారు. క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్లపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొద్ది నెలల పాటు మధ్యలో ఎలాంటి హత్యలు జరగకపోవడం వల్ల పోలీసుల ఊపిరి పీల్చుకున్నారు. అయితే..మళ్లీ ఈ ఏడాది జులైలో ఓ మర్డర్ జరిగింది. డబ్బులు విత్‌డ్రా చేసుకోడానికి బయటకు వెళ్లిన మహిళ చెరకు తోటలో శవమై కనిపించింది. ఈ హత్యలన్నింటి వెనకా ఒకడే వ్యక్తి ఉండొచ్చని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. (Also Read: Viral News: క్రిమినల్‌ని పట్టుకునేందుకు పోలీస్ సాహసం, బిజీ రోడ్డుపై ప్రాణాలకు తెగించి - వీడియో)
ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్న పోలీసులు నిందితుడి ఊహాచిత్రాలను విడుదల చేశారు. హత్యలు జరిగిన ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి ఈ ఊహా చిత్రాలు గీయించారు. మొత్తం ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లు విడుదల చేశారు. ఈ వ్యక్తుల గురించి ఎలాంటి సమాచారం అందినా వెంటనే తెలియజేయాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ హత్యలన్నీ ఒకే విధంగా జరగడం వల్ల ఒకడే వ్యక్తి ఇన్నీ చేసి ఉంటాడని నమ్ముతున్నారు. ఆ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి పలు పోలీసు బృందాలు ఈ కిల్లర్‌ని పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెడుతున్నాయి. అయితే...పోలీసులకు ఇది ఛాలెంజింగ్ టాస్క్‌గా మారింది. స్థానికుల సాయంతో త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తామని చెబుతున్నారు.
"మా టీమ్స్ రంగంలోకి దిగాయి. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చెక్‌పాయింట్స్ వద్ద నిఘాని మరింత పెంచాం. అనుమానం వచ్చిన వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నాం. స్థానిక గ్రామాల్లోనూ ప్రజల్ని అప్రమత్తం చేశాం. ఈ హత్యల వెనకాల ఎవరున్నారన్నది త్వరలోనే బయటపెడతాం"
- పోలీసులు
Also Read: Viral News: స్కామ్ కాలర్‌కి చుక్కలు చూపించిన యువకుడు, ఇలా చేస్తే మీ డబ్బు సేఫ్ - వీడియో