Viral News: క్రిమినల్‌ని పట్టుకునేందుకు పోలీస్ సాహసం, బిజీ రోడ్డుపై ప్రాణాలకు తెగించి - వీడియో
Viral Video: కర్ణాటకలో ఓ పోలీస్ క్రిమినల్‌ని పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించాడు. నడిరోడ్డుపై బైక్‌ని వెంబడించి పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral News in Telugu: ఓ దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ నడిరోడ్డుపై పెద్ద సాహసమే చేశాడు. కాస్త అటు ఇటు అయినా తీవ్రంగా గాయపడడమో, లేదంటో ప్రాణాలు పోవడమో జరిగేది. కానీ అదేమీ ఆలోచించకుండా వెంటపడి మరీ ఆ దొంగను పట్టుకున్నాడు. అది కూడా ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండే చోట. సరిగ్గా సిగ్నల్ పడి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా గుర్తుపట్టి వెంటపడ్డాడు. తప్పించుకునేందుకు ఆ దొంగ చాలానే ప్రయత్నించాడు. అయినా ఆ కానిస్టేబుల్ పట్టువిడవలేదు. గట్టిగా పట్టుకుని చౌరస్తాలో అటకాయించాడు. ఈలోగా చుట్టూ ఉన్న వాళ్లంతా వచ్చి అడ్డగించారు. ఫలితంగా దొంగ ఎటూ కదల్లేక దొరికిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ దొంగను కానిస్టేబుల్ ఛేజ్ చేసి మరీ పట్టుకున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ಕುಖ್ಯಾತ ಆರೋಪಿ ಮಂಜೇಶ್@ಮಂಜ@ಚೌಟ್ರಿಮಂಜ@ಹೊಟ್ಟೆ ಮಂಜನ ಬಂಧನ. #TumakruDistrictPolice. #KoratagerePS #MadhugiriSubDivision@venkatashok@BlrCityPolice@blrcitytraffic@ssnagartrfps pic.twitter.com/6plIrq7zbl
— SP Tumakuru (@SPTumkur) August 8, 2024
ఏం జరిగింది..?
తుముకూరులోని కోరటగెరె పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దొడ్డ లింగయ్య సదాశివ నగర్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో క్రిమినల్ మంజేశ్ అలియాస్ 420 మంజా అలియాస్ హొట్టే మంజా ఓ స్కూటీపైన కనిపించాడు. సిగ్నల్ పడగానే ముందుకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో మంజేశ్‌ని గుర్తు పట్టిన కానిస్టేబుల్ వెంటనే చేజ్ చేశాడు. అతని బైక్‌ని చుట్టుముట్టాడు. ఒక్కసారిగా మీదకు దూకి పట్టుకోవాలని ప్రయత్నించాడు. అంత బిజీ రోడ్డులో అన్ని వాహనాలు వస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రాణాల్నే పణంగా పెట్టాడు. దాదాపు 20 మీటర్ల వరకూ ఆ క్రిమినల్..కానిస్టేబుల్‌ని లాక్కుని వెళ్లాడు. అయినా వదలకుండా పట్టుకున్నాడు. ఒక్కసారిగా పట్టుకోల్పోయాడు. క్రిమినల్ పారిపోవాలని చూడగా కాళ్లు పట్టుకుని లాగాడు కానిస్టేబుల్.
ఇదంతా గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ క్రిమినల్‌ని చుట్టుముట్టారు. ఆ తరవాత అక్కడి వాహనదారులూ వచ్చి క్రిమినల్ ఎటూ కదలకుండా అడ్డుకున్నారు. దాదాపు నెల రోజులుగా ఈ నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు. సరిగ్గా సిగ్నల్ వద్ద కనిపించే సరికి ఆ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి పట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పోలీస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ గట్స్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ క్రిమినల్‌ని పట్టుకున్న పోలీసులందరినీ ఉన్నతాధికారులు అభినందించారు. ఈ ఘటన జరిగినప్పుడు చుట్టు వాహనదారులంతా షాక్ అయ్యారు. అసలు వాళ్లకు ఏం జరుగుతోందో ముందు అర్థం కాలేదు. ఆ తరవాత పోలీసులంతా వచ్చి ఓ వ్యక్తిని పట్టుకోడానికి ప్రయత్నించే సరికి అందరూ ముందుకొచ్చారు. దారిన వెళ్లే వాళ్లు కూడా బండి ఆపుకుని పోలీసులకు సహకరించారు. అందరూ కలిసి ఆ క్రిమినల్‌ని పట్టుకున్నారు.