(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: ఆ బాలిక ఆచూకీ ఇంకా లభించలేదు - నంద్యాల జిల్లాలో మైనర్‌పై ఘోరం, తీవ్రంగా గాలిస్తోన్న పోలీసులు
Andhrapradesh News: నంద్యాల జిల్లాలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపింది. బాలికను నదిలో పడేశామని నిందితులు చెప్పగా.. పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Girl Killed By Three Minors In Nandyal District: నంద్యాల జిల్లాలో (Nandyal District) బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బాలికపై దారుణానికి ఒడిగట్టడంతో చిన్నారి చనిపోగా.. మృతదేహాన్ని హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కాలువలో పడేశారు. ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారు చెప్పిన వివరాల ప్రకారం నదిలో గాలింపు చేపట్టారు. నిందితులు మంగళవారం నేరాన్ని అంగీకరించారని.. అదే రోజు సాయంత్రం వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌కు కొంతదూరంలో కాలువలో బాలిక మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని చూపించారని చెప్పారు.
తీవ్ర గాలింపు
పోలీసుల సూచనతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక మత్స్యకారులు వలలతో తీవ్రంగా గాలించారు. మరోవైపు గజ ఈతగాళ్లను సైతం రప్పించి గాలింపు చేపట్టారు. ఎంతకీ బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మరోసారి నిందితులను గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్ సమీపంలోనే పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. 30 అడుగుల నీటిలో గాలింపు చేపడుతున్నారు. నలుగురు బాలురు కలిసి బాలికను తీసుకెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మరో బాలుడు లైంగిక దాడికి పాల్పడలేదని మిగతా ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.
ఆట పేరుతో తీసుకెళ్లి..
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం మచ్చుమర్రి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక అందరి పిల్లలతో పాటు ఆదివారం గ్రామ వీధుల్లో ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు బాలికను ఆడుకుందామని మాయమాటలు చెప్పి జన సంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో దారుణానికి ఒడిగట్టారు. వారి అఘాయిత్యాన్ని భరించలేక పాప మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని నదిలో పడేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయారు.
బాలిక ఆచూకీ తెలియక ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బాలిక తల్లిదండ్రులు ఎంపీ బైరెడ్డి శబరిని ఆశ్రయించారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడగా.. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం బాలిక ఎక్కడికి వెళ్లిందనే కోణంలో విచారించారు. డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టగా.. బాలికపై అఘాయిత్యం జరిగిన ప్రాంతాన్ని గుర్తించి పలు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో పోలీసులు ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు వారు పోలీసుల ఎదుట ఒప్పుకొన్నారు. ఆమె చనిపోవడంతో ఏం చేయాలో తెలియక నదిలో పడేశామని చెప్పారు. దీంతో పోలీసులు నిందితులు చెప్పిన చోట గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.
Also Read: Anakapalli: అనకాపల్లి జిల్లాలో బాలికను హత్య చేసిన ప్రేమోన్మాది ఆత్మహత్య