Anakapalli: అనకాపల్లి జిల్లాలో బాలికను హత్య చేసిన ప్రేమోన్మాది ఆత్మహత్య
Andhra Pradesh: ప్రేమ పేరుతో బాలికను చిత్రవధ చేసి చంపిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లిలో జరిగిన ఈ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Crime News: అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలం కొప్పుగుండపాలెంలో ప్రేమ పేరుతో ఓ బాలికను వేధించి చంపేసిన ఉన్మాది ఆత్మహత్య చేసుకున్నాడు. చేసింది తప్పని ఆలస్యంగా తెలుసుకున్న ఆ వ్యక్తి తప్పించుకునే మార్గాలు లేక, బయట తిరగలేక శిక్ష తప్పదని తనకు తానే శిక్ష వేసుకున్నాడు.
కొప్పుగుండపాలెంలోని తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికతో ప్రేమ అంటూ సురేష్ తిరిగాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు సురేష్. శనివారం ఆమెపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు.
నిత్యం ఆమెను ఫాలో అయ్యే సురేష్.. శనివారం కూడా అదే పని చేశాడు. ఆమె స్కూల్ నుంచి ఇంటికి వచ్చి బాత్రూమ్‌కు వెళ్లడాన్ని చూశాడు. అదే అదునుగా అందులోకి వెళ్లి ఆమెను నరికి చంపాడు.
ఉన్మాది ఘాతుకానికి బాలిక స్పాట్‌లోనే చనిపోయింది. ఆమె చనిపోయిన విషయాన్ని గ్రహించిన సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు వచ్చేసరికి సురేష్ కనిపించకుండా పోయాడు. విషయాన్ని వాళ్లంతా పోలీసులకు చేరవేశారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శనివారం నుంచి పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా 14 పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం జల్లెడపట్టారు. ఫోన్ ట్రాప్ చేశారు. అయినా పట్టుకోలేకపోయారు. ఆచూకి చెప్పిన వారికి 50 వేల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది.
పోలీసుల గాలింపు చర్యలు సాగుతుండగానే... ఆ గ్రామ చెరువులో ఓ మృతదేహం ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహం చూస్తే గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. చివరకు ఆ డెడ్‌బాడీకీ ఉన్న అనవాళ్లతో అది సురేష్ డెడ్‌బాడీగా గుర్తించారు.
హత్య చేసిన రోజునే సురేష్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా కొట్టి చెరువులో పడేసి ఉంటారన్న ఆనుమానాలను కూడా పోలీసులు కొట్టిపారేశారు. డెడ్‌బాడీపై ఎలాంటి గాయాలు లేవని తేల్చి చెప్పారు. తనకు తానుగానే చెరువులో దూకి చనిపోయి ఉంటాడని అంటున్నారు.
బాగా కుళ్లిపోయిన సురేష్ డెడ్‌బాడీని పోస్టుమార్టానికి పంపించారు. అన్ని వైపుల నుంచి పోలీసులు చుట్టుముట్టడం, ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడం, అతని కోసం గ్రామస్థులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెతుకుతుండటంతో పారిపోయే ఆస్కారం లేకనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలువురిపై తీసుకున్న చర్యలు నేరస్థుల పాలిట సింహస్వప్నంలా మారాయని అన్నారు. నేరస్థుల విషయంలో ప్రభుత్వ కఠిన వైఖరితో ఆడపిల్లలవైపు చూడాలంటేనే హడలిపోతున్నారని... అనకాపల్లి బాలిక హత్య కేసులో ఇదే జరిగిందని చెప్పుకొచ్చింది. ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేసింది. స్వయంగా హోంమంత్రి అనిత ఈ కేసును పర్యవేక్షించారని గుర్తు చేసింది ప్రభు్త్వం. నిందితుడి కోసం 12 బృందాలు గాలించాయని... ప్రభుత్వం శిక్షిస్తుందన్న భయంతో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. కొద్దిరోజుల క్రితం చీరాలలో బాలిక హత్య ఘటనలో 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్టు గుర్తు చేసింది.