Vizag DCCB Scam: విశాఖ సహకార బ్యాంకులో ఫేక్ బిల్స్ కలకలం, ఏకంగా ఎన్ని కోట్లు మాయం చేశారంటే !
Vizag DCCB Scam: డీసీసీబీలో తప్పుడు లెక్కలు తేలుతున్నాయి. తాజా, మాజీ సీఈవోలు.. పాలక మండలి సభ్యుల్లో కొందరు కలిసి జిల్లా సహకార బ్యాంకును రూ.3 కోట్ల మేర మోసం చేశారని పోలీసులు గుర్తించారు.
Visakhapatnam DCCB Rs 3 Crore Scam Case: వైజాగ్ డీసీసీబీ అక్రమాలకు నెలవుగా మారింది. మాజీ ఛైర్మన్ తోపాటు మరి కొంతమంది సభ్యులు కలిసి ఫేక్ బిల్లుల (Fake Bills)తో ఏకంగా మూడు కోట్ల రూపాయల వరకూ మాయం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వైజాగ్ లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కో- ఆపరేటివ్ రిజిస్ట్రర్ట్ ప్రత్యేక విచారణ చేపట్టారు. ఖర్చుల పేరుతో కొంత, ఉద్యోగుల జీతాల సమయంలో కొంత ఇలా నెమ్మదిగా దోచేస్తూ.. విచారణ చేపట్టే సరికి మొత్తం దొరికిపోయారు. డీసీసీబీలో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ తరఫున అప్పట్లో యలమంచిలి శాసన సభ్యుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా అందులోని అనేక అంశాలు రుజువుకావడంతో గత పాలకమండలి సభ్యులతో సహా తాజా.. మాజీ సీఈవోలపై కేసులు నమోదు అయ్యాయి.
వారంతా ప్రధాన నిందితులుగా నిర్ధారణ
అప్పటి బ్యాంకు చైర్మన్ సుకుమార్ వర్మతో పాటు ఇరవై మంది డైరెక్టర్లు, అప్పటి సీఈవోలు పాపారావు, వీరబాబు, ప్రస్తుత సీఈవో డీవీఎస్ వర్మ, జనరల్ మేనేజర్ అన్నపూర్ణలను ఈ కేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, ఇతర పద్దుల్లో సంస్థకు అసలు లెక్కలు చూపకుండా కృత్రిమ లాభాలు చూపారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా కృత్రిమ లాభాలు చూపించి దాని భారీ మొత్తాన్ని టాక్స్ చెల్లించి సంస్థకు మూడు కోట్ల రెండు లక్షల రూపాయల నష్టాన్ని కలిగించారని కో -ఆపరేటివ్ కమిటీ సెక్షన్ -51 ఎంక్వైరీ లో రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ నిర్ధాయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశాలు
ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి సీఈవో పాపారావు కోటీ 6 లక్షల రూపాయలు, వీరబాబు వల్ల 90 లక్షల రూపాయలు నష్టం వాటిల్లితే ప్రస్తుత సీఈవో వల్ల 60 లక్షల నష్టం వాటిల్లిందని విచారణలో తేలినట్టు చెబుతున్నారు. మొత్తం 3 కోట్ల 2 లక్షల రూపాయల నష్టానికి కారకులైన వారిపై క్రిమినల్ సెక్షన్ల క్రింద చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అందాయి. అలాగే వీరబాబు, పాపారావు హయాంలో సొసైటీలకు గిఫ్ట్ లు ఇచ్చామంటూ 17 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తేలింది. ఈ మొత్తంపై కూడా వీరిద్దరినీ బాధ్యులను చేశారు. దొంగ బిల్లులతో.. సంస్థకు మూడు కోట్ల నష్టాన్ని తెచ్చిన పెద్దల భాగోతం బయటపడడంతో డీసీసీబీ అధికారులు బెయిల్ వేటలో పడ్డారు. అయితే జరిగిన నష్టంలో కనీసం సగం చెల్లిస్తేనే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.