Hyderabad Thief Arrest: చోరీల్లో సెంచరీ కొట్టిన చిట్టీల దొంగ- అతడు వేసుకునే చెప్పుల ఖరీదు ఐదువేలు- ఇంకా చాలా ఉన్నాయి!
వరుస చోరీలతో పోలీసులకే సవాల్‌గా మారిన ఘరానా దొంగ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మగవారి కోసం ఎంతకైనా తెగించేవాడని... వారి ఆనందం కోసం దొంగతనాలు చేసేవాడని గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు.
Hyderabad Thief Arrest: అనగనగా ఓ చోరుడు... వయస్సు 28ఏళ్లే.. కానీ చేసిన దొంగతనాలు మాత్రం వందకుపైనే. దోచుకున్న సోమ్ముతో విలాసవంతమైన జీవితం గడపడం అతని అలవాడు. పైగా మగవారంటే పిచ్చి. మగవారితో చనువుగా ఉండేవాడు. వారి సంతోషం కోసం ఎంతకైనా తెగించేవాడు. వారు బాధల్లో ఉంటే... దొంగతనం చేసి డబ్బులు తెచ్చిఇచ్చేవాడు. ఈ ఘరానా దొంగపై నిఘా పెట్టి పట్టుకున్నారు పోలీసులు. అతన్ని అరెస్ట్ చేసి... 13.50 లక్షల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్ శంకర్‌నాయక్. అసలు పేరు ఇదే అయినా... మారుపేర్లు చాలానే ఉన్నాయి. రాజేశ్‌రెడ్డి, రంగారావు, ఇలియాజ్ ఖాన్... ఇలా ఎన్నో పేర్లతో చలామణి అయ్యాడు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లిలో 2012లో బీఫార్మసీ పూర్తిచేశాడు. హత్యాయత్నం కేసులో ఇతన్ని గద్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైల్లో ఓ దొంగతో శంకర్‌నాయక్‌కు పరిచయం అయ్యింది. దొంగతనాలు ఎలా చేయాలో అతని దగ్గర నేర్చుకున్నాడో ఏమో... జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత... వరుస చోరీలకు పాల్పడ్డాడు. గంజాయి, మద్యానికి అలవాటు పడ్డాడు. దురలవాడ్లకు డబ్బు అవసరం అయినప్పుడల్లా దొంగతనాలు చేసేవాడు. తాళం వేసుకున్న ఇళ్లనే టార్గెట్ చేసుకుని... విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు కొట్టేసేవాడు. దోచుకున్న సొమ్మును తాకట్టు పెట్టి, అమ్మేసి.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు.
అంతేకాదు... ఈ దొంగకు మరో అవలక్షణం కూడా ఉంది. అదే మగవారితో చనువుగా ఉండేవాడు. వారి సాన్నిహిత్యం కోరుకునేవాడు. తనతో ఉండే మగవారి కోసం ఎంతకైనా తెగించేవాడు శంకర్‌నాయక్. వారిని సంతోషపెట్టేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడేవాడు. వారికి డబ్బు అవసరమైందంటే చాలు... ఆ రోజు ఏదో ఒక ఇంటికి కన్నం వేసేవాడు. క్షణాల్లో నగదు, నగలు చోరీ చేసి తెచ్చి ఇచ్చేవాడు. ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరుస చోరీలకు పాల్పడడ్డారు నిందితుడు శంకర్‌నాయక్. ఏపీ, తెలంగాణాల్లోని పలు పోలీస్‌స్టేషన్‌ల్లో ఇతడు మోస్ట్‌వాంటెండ్ దొంగ.
శంకర్‌నాయక్... ఎక్కడా ఒక చోట స్థిరంగా ఉండకుండా కాదు. పోలీసులకు దొరక‌్కుండా తప్పించుకు తిరుగేవాడు. పెద్ద పెద్ద లాడ్జీలు, ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేసేవాడు. అంతేకాదు కాస్ట్‌లీ దుస్తులు, చెప్పులు ధరించేవాడని పోలీసులు తెలిపారు. పోలీసులకు పట్టుబడిన సమయంలో కూడా శంకర్‌నాయకు 5వేల రూపాయల విలువైన చెప్పులు, 11వేల రూపాయల విలువైన బ్రాండెడ్ దుస్తులు ధరించి టిప్‌టాప్‌గా ఉన్నాడట.
శంకర్‌నాయక్‌కు మరో విచిత్రమైన అలవాటు కూడా ఉంది. చోరీ చేసిన ఇళ్లలో... ఎంత దోచుకున్నది చిట్టీ రాసి అక్కడ పెట్టేవాడట. అలా ఎందుకంటే... గతంలో ఇతను ఒక ఇంట్లో చోరీకి చేశాడు. అక్కడ కొట్టేసిన నగలు 10 తులాలైతే.. 20 తులాలు పోయాయంటూ ఇంటి ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్‌నాయక్ పోలీసులకు పట్టుబడినప్పుడు.. తాను దొంగిలించింది 10 తులాలే అని చెప్పినా పోలీసులు నమ్మలేదట. అందుకే ఆ తర్వాత చిట్టీలు రాసిపెట్టే అలవాటు చేసుకున్నాడు. చోరీ చేసిన ఇంట్లో.. ఇంట్లో కొట్టేసిన నగదు, నగలు వివరాలను చీటీ రాసి అక్కడ ఉంచేవాడు. తన డైరీలో కూడా వివరాలు రాసుకునేవాడు. పోలీసులకు పట్టుబడినప్పుడు డైరీ చూసి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసేవాడు శంకర్‌నాయక్.
ఉదయం పూట.. కాలనీల్లో తిరుగుతూ... తాళం వేసుకున్న ఇళ్లను గమనించే వాడు. తాను చోరీ చేసేందుకు... అనువున్న ఇళ్లను టార్గెట్ చేశాడు. రాత్రి సమయంలో ఇనుప రాడ్డుతో వెళ్లి.. ఇంటి తాళం పగులగొట్టి దొంగతనం చేసేవాడని పోలీసులు చెప్తున్నారు. ఒక దోచుకున్న డబ్బు అయిపోగానే మళ్లీ రంగంలోకి దిగేవాడట. ఇలా ఇటీవల ఇటీవల వరుస దొంగతనాలతో హల్‌చల్ చేయడంతో.. పోలీసులు అతనిపై నిఘా మరింత పెంచారు హైదరాబాద్ ఓయూ పోలీసులు.
మూడు నెలల క్రితం ఓయూ పరిధిలోని హబ్సిగూడలో లగిశెట్టి రాజు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేశారు శంకర్‌నాయక్. 19.1 తలాల బంగారం, యూఎస్ డాలర్లతోపాటు కొంత నగదు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. శంకర్‌నాయకే దొంగతనం చేసినట్టు నిర్ధారించి నిఘా పెంచారు. అమీర్‌పేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శంకర్‌నాయక్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 13లక్షల 50వేల రూపాయల విలువైన ఆభరణాలు, బైక్‌లు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్, విజయవాడ, ఎస్‌ఆర్‌నగర్‌లోని పలు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, బంగారు షాపుల్లో నగదు తాకట్టు పెట్టిన రశీదులను స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు.