Wikipedia: మరో వివాదంలో అదానీ, ఈసారి దాడి వికీపీడియాది, ఉన్న కాస్త పరువూ తీసేసింది!
ఒక కంపెనీ IP అడ్రస్‌ను ఉపయోగించిన ఒక పెయిడ్ ఎడిటర్ అదానీ గ్రూప్‌నకు సంబంధించిన ఒక కథనాన్ని పూర్తిగా మార్చి రాశాడు
Adani Group - Wikipedia: అదానీ గ్రూప్ మరో తీవ్ర వివాదంలో చిక్కుకుంది. పెయిడ్ ఎడిటర్లతో అదానీ గ్రూప్ (Adani Group) సమాచారాన్ని మార్చారని, గౌతమ్ అదానీని అనుకూలంగా కంటెంట్ క్రియేట్ చేశారని అదానీ గ్రూప్ మీద వికీపీడియా (Wikipedia) ఆరోపణలు చేసింది. గౌతమ్ అదానీ, గ్రూప్ కంపెనీలకు సంబంధించిన సమాచారంతో పాటు అదానీ కుటుంబ సభ్యుల విషయంలోనూ పక్షపాతంతో కూడిన సమాచారాన్ని చొప్పించారని విమర్శించింది.
"సాక్ పప్పెట్ ఖాతాలు (sock puppet accounts) లేదా గుర్తింపును ప్రకటించని పెయిడ్ ఎడిటర్లు (undeclared paid editors) అదానీ కుటుంబం & కుటుంబ వ్యాపారాలపై తొమ్మిది కథనాలను సృష్టించారు లేదా సవరించారు. వారిలో చాలా మంది అనేక కథనాలను సవరించారు & నాన్-న్యూట్రల్ సమాచారం లేదా పఫ్రీని జోడించారు. ఒక కంపెనీ IP అడ్రస్‌ను ఉపయోగించిన ఒక పెయిడ్ ఎడిటర్ అదానీ గ్రూప్‌నకు సంబంధించిన ఒక కథనాన్ని పూర్తిగా మార్చి రాశాడు" అని వికీపీడియాకు చెందిన వార్త పత్రిక ది సైన్‌పోస్ట్ (The Signpost) ఓ కథనం ప్రచురించింది.
గౌతమ్ అదానీ గురించి వికీపీడియాలో 2007లో కథనాలు మొదలయ్యాయని, మొదట్లో అవన్నీ న్యూట్రల్‌గా (తటస్థంగా) ఉండేవని వికీపీడియా తెలిపింది. 2012 నుంచి అదానీ గ్రూప్ కథనాల్లో మార్పులు మొదలయ్యాయని, అప్పట్లో ముగ్గురు ఎడిటర్లు అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన కథనాల్లో మార్పులు చేశారని వికీపీడియా పేర్కొంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు (conflict-of-interest) సంబంధించిన హెచ్చరికలను సైతం వారు తొలగించారని వెల్లడించింది. వికీపీడియా కంటెంట్‌లో మార్పు చేసిన వారిలో అదానీ గ్రూప్ కంపెనీ ఉద్యోగులు కూడా ఉన్నారని, అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన IP అడ్రస్‌లను తాము గుర్తించినట్లు వికీపీడియా తెలిపింది.
నిఘా వ్యవస్థలను ఏమార్చి మరీ మార్పులు
వికీపీడియా క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థలను ఏమార్చేందుకు అసాధారణ పద్దతులను ఉపయోగించి కథనాలు సృష్టించారని వికీపీడియా ఆరోపించింది. ఈ విపరీత పరిణామాలను గుర్తించిన తర్వాత, 40కి పైగా సాక్ పప్పెట్స్ లేదా గుర్తింపును ప్రకటించని పెయిడ్ ఎడిటర్లను బ్యాన్ లేదా బ్లాక్ చేసినట్లు వికీపీడియా ప్రకటించింది.
ఈ తరహా కొత్త కథనాలు లేదా కథనాల్లో మార్పులను సమీక్షించి, వాస్తవాలను నిర్ధరించాల్సిన రివ్యూయర్ హాచెన్స్ (Hatchens) తన ఉద్యోగ బాధ్యతను దుర్వినియోగం చేసినట్లు గుర్తించాన్న వికీపీడియా, అతనిపైనా నిషేధం విధించింది. అదానీకి సంబంధించి తొమ్మిది కథనాల్లో ఏడింటికి ఆయన ఆమోదం తెలిపారని పేర్కొంది. బహుశా అవినీతికి పాల్పడి ఉండవచ్చని వెల్లడించింది.
విశేషం ఏంటంటే... వికీపీడియాలో వచ్చిన ఈ కథనాన్ని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) వ్యవస్థాపకుడు నాథే ఆండర్సన్ ట్వీట్ చేశారు. సాక్ పప్పెట్ ఖాతాలు, గుర్తింపు ప్రకటించని పెయిడ్ ఎడిటర్లను ఉపయోగించడం, పరస్పర విరుద్ధ ప్రయోజనాల సాక్ష్యాలను తొలగించడం వంటి పనుల ద్వారా వికీపీడియా ఎంట్రీలను ఒక క్రమపద్ధతిలో అదానీ గ్రూప్ ఎలా తారుమారు చేసిందో సైన్‌పోస్ట్ కథనం నిరూపించిందని ట్వీట్ చేశారు.
ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు.