Bad Time For Startups : స్టార్టప్స్‌కు గడ్డు కాలం - వరుసగా ఉద్యోగుల తొలగింపు !
ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. నష్టాల నుంచి బయటపడలేకపోతున్నాయి.
Bad Time For Startups : స్టార్టప్స్ అంటే మొక్కలా ప్రారంభించి మానులా ఎదిగేవి. అయితే అలా ఎదిగే వాటి సంఖ్య రాను రాను పడిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగులను వదిలించుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. నష్టాల ఊబిలో ఇరుక్కున్న కంపెనీలు ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇండియాలో ఈ ఏడాది స్టార్టప్ కంపెనీలు 12 వేల మంది ఉద్యోగులను వదిలించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 22 వేల మంది నిరుద్యోగులయ్యారు. ఇండియాలోనే ఈ ఏడాదిలో మరో 50 వేల మంది ఉద్యోగాలకు ముప్పు తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్ లో ఇప్పుడు దాదాపు 66 వేల స్టార్టప్ లు ఉన్నాయి. 2014లో మోదీ అధికారానికి వచ్చిన తర్వాత స్టార్టప్స్ ను ప్రోత్సహించే ప్రక్రియ వేగం పుంజుకుంది. 2020లో కరోనా విజృంభిస్తున్నప్పుడు స్టార్టప్స్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇప్పుడు మాత్రం ఖర్చులు తగ్గించుకోవడం మినహా వేరు గత్యంతరం లేదన్న నిర్ణయానికి వచ్చాయి.
అన్అకాడమీ, కార్స్24, వేదాంతాతో సహా ఇండియాలోని ప్రముఖ స్టార్టప్‌లు ఈ సంవత్సరం ఉద్యోగులను తొలగించాయి. ఓలా ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో దాదాపు 2,100 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత అన్అకాడమీ 600 మందికి పైగా, కార్స్24 600 మందినితీసేసింది. ఈ-కామర్స్ సంస్థ మీషో 150 మంది ఉద్యోగులను, ఫర్నిచర్ రెంటల్ స్టార్టప్ ఫుర్లెంకో 200 మందిని, ట్రెల్ 300 మంది ఉద్యోగులను, ఓకే క్రెడిట్ 40 మంది ఉద్యోగులను తొలగించింది.
స్టార్టప్స్ వ్యవహారాల్లో వృథా వ్యయం పెరిగిందన్న వాదన వినిపిస్తున్నాయి. నిధుల ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటూనే... ఉత్పత్తుల సమర్థతను, మార్కెట్లో వాటికున్నవిశ్వసనీయతను అంచనా వేసుకున్నప్పుడే స్టార్టప్ లు మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల మార్కెటింగ్ అవకాశాలున్న వస్తువులను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తే కంపెనీల విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంటుంది.
పెట్టుబడుల వెల్లువ నుంచి నిధులు ఎండిపోయే పరిస్థితి వచ్చిపడింది. ఒకప్పుడు పెద్ద కంపెనీలు పరస్పర ఆమోదయోగ్యమైన డీల్స్ కుదుర్చుకునేవి. ఇప్పుడు డీల్స్ పరిమాణం పూర్తిగా తగ్గిపోవడంతో స్టార్టప్స్ కష్టాలు తగ్గిపోతున్నాయి. ప్రతికూల మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోగలిగితే.... కొంతమేరైనా గట్టెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. లాభదాయకత ఉన్న కంపెనీల వైపే పెట్టుబడిదారులు మొగ్గు చూపడంతో మిగతా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉంటుంది.. వచ్చే కొన్నేళ్లలో భారత్‌లో అరవై వేల వరకూ ఉద్యోగులను స్టార్టప్స్ వదిలించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.