TDS: ముక్కు పిండి మరీ టీడీఎస్ వసూళ్లు, కొత్త రూల్స్‌తో రెవెన్యూ పెంచుకున్న సర్కార్
2021-22 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ. 6.34 లక్షల కోట్లు ఆర్జించింది.
TDS Revenue: వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అవసరాల కోసం చేసే వ్యయాలు పెరుగుతున్నాయి. దీంతో ఖజానాపై ఒత్తిడి కూడా క్రమంగా పెరిగింది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో, TDS (Tax Deducted at Source) ఆదాయ సేకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో గత కొన్నేళ్లుగా విజయం సాధిస్తోంది. టీడీఎస్ ద్వారా ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ విధంగా కలెక్షన్లను పెంచింది
గణాంకాల ప్రకారం... 2021-22 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ. 6.34 లక్షల కోట్లు ఆర్జించింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ఇది దాదాపు 39 శాతం. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు ద్వారా అందుకున్న రూ. 7 లక్షల కోట్లకు చాలా దగ్గరగా ఉంది. కొన్నేళ్ల క్రితం నాటి లెక్కలతో పోలిస్తే, టీడీఎస్ సంపాదన ఏ స్థాయిలో పెరిగిందో అర్ధం అవుతుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కేవలం రూ. 2.59 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి, మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ఇది 32 శాతం. అంటే గత ఏడేళ్లలో టీడీఎస్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు దాదాపు రెండున్నర రెట్లు పెరిగాయి.
టీడీఎస్‌కు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. పన్నుల వసూళ్లు, ఖజానాకు జమ చేసే బాధ్యత ఒకే పార్టీపై ప్రభుత్వం పెట్టింది. ఈ చర్యతో ఫలితం కనిపించింది, అంచనాలకు అనుగుణంగా వసూళ్లు పెరిగాయి. మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో TDS ఆదాయాల నిష్పత్తి 2014-15 ఆర్థిక సంవత్సరంలోని 32 శాతం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 39 శాతానికి పెరిగింది.
మరికొన్ని కఠిన నిబంధనలు
టీడీఎస్‌కు సంబంధించి ప్రభుత్వం తాజాగా మరికొన్ని నిబంధనలను కఠినతరం చేసింది. లిస్టెడ్ డిబెంచర్లపై చెల్లించే వడ్డీపై టీడీఎస్ మినహాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బు గెలిస్తే, కనీస పరిమితి లేకుండా TDS అమలు చేస్తోంది. కొన్ని కేటగిరీల ఫారిన్ రెమిటెన్స్‌లపై టీడీఎస్ రేటును 5 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వీటిలో విదేశీ ప్రయాణ ప్యాకేజీల కొనుగోళ్లు కూడా ఉన్నాయి. గత ఏడాది క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌పై కూడా ప్రభుత్వం టీడీఎస్ విధించింది. ఈ విధంగా TDS నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
మెరుగైన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో ప్రత్యక్ష పన్ను వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయం 50 శాతానికి పైగా ఉన్నట్లు ఆదాయపు పన్ను విభాగం గణాంకాలు కూడా చూపుతున్నాయి. ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం పన్ను వసూళ్లలో ప్రత్యక్ష పన్నుల వాటా పరోక్ష పన్నుల కంటే తక్కువగా ఉంది, ఇప్పుడు పెరిగింది.